ఒడిశాలోని నవరంగ్పుర్లో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం రథయాత్ర సందర్భంగా సెలవును అదనుగా తీసుకుని స్థానిక పాఠశాలలోకి చొరబడి కంప్యూటర్లు తదితర సామగ్రిని దోచుకెళ్లారు. అంతటితో ఆగకుండా తరగతి గదుల బ్లాక్బోర్డులపై 'ధూమ్-4 త్వరలోనే రాబోతుంది' అంటూ రాశారు. శనివారం ఉదయం పాఠశాలకు వచ్చి అది చూసిన ఉపాధ్యాయులు అవాక్కై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే?.. శుక్రవారం పూరీ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా ఒడిశా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం నవరంగ్పుర్ పాఠశాలకు ఉపాధ్యాయులు రాగా.. బయట తలుపులకు వేసి ఉన్న తాళాలు పగిలి ఉండడం గమనించారు. లోపలకి వెళ్లి ప్రిన్సిపల్ గది చూసేసరికి కంప్యూటర్లు, జిరాక్స్ యంత్రాలు కనిపించలేదు. సౌండ్ బాక్సులు సహా పలు సామాన్లు చోరీకి గురయ్యాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న తరగతి గదుల బ్లాక్బోర్డులపై దొంగలు రాసింది చూసి అందరూ అవాక్కయ్యారు. 'త్వరలోనే ధూమ్-4 రాబోతుంద'ని దొంగలు బోర్డు మీద రాశారు.