నాలుగేళ్ల క్రితం.. అప్పుడే పుట్టిన ఓ పసికందును ఓ వ్యక్తి కాలువలో పడేశారు. ఆ చిన్నారిని బయటకి తీసి చికిత్స అందించిందో సేవా సంస్థ. ప్రస్తుతం బాలల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆ బాబుకు.. ఇటలీకి చెందిన ఓ జంట కొత్త జీవితాన్ని అందించడానికి ముందుకు వచ్చింది. దీంతో ఆ చిన్నారి విషయం వెలుగులోకి వచ్చింది. 2018లో మహారాష్ట్రలోని ఠాణెలో జరిగిందీ ఘటన. అయితే మృత్యువుని జయించిన ఆ నవజాత శిశువును కాపాడిన ఫౌండేషన్ వారు.. ఆ చిన్నారికి 'టైగర్' అనే పేరు పెట్టారు. టైగర్ గురించి తెలిసుకున్న ఇటలీ జంట.. దత్తత ప్రక్రియకు కావలసిన అన్ని నియమాలను పూర్తి చేసి ఇటలీకి పయనమైంది. మరి టైగర్ కథేంటో తెలుసుకుందామా మరి..!
అసలేం జరిగిందంటే..!
2018 డిసెంబర్ 30న ఠాణె.. ఉల్హాస్నగర్ ప్రాంతంలోని వడోల్ గ్రామంలో ఉన్న కాలువలో.. అప్పుడే పుట్టిన పసికందు ఏడుస్తూ ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే సామాజిక కార్యకర్త, అశోక ఫౌండేషన్‌కు చెందిన శివాజీ రాగ్దేకు ఈ విషయాన్ని చెప్పారు. అక్కడికి చేరుకున్న శివాజీ దంపతులు తీవ్ర గాయాలతో ఉన్న శిశువును బయటకు తీశారు. వెంటనే దగ్గర్లోని సెంట్రల్ ఆస్పత్రిలో చేర్పించి.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శిశువును కాలువలో పడేసిన గుర్తుతెలియని వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ చిన్నారి తలకు తీవ్ర గాయం అవ్వడం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో శివాజీ అప్పటి ఎంపీ, ఎమ్మెల్యేల సహాయంతో.. ఆ పసికందును మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ ఆస్పత్రికి తీసుకువెళ్లిన 24 గంటల్లోనే దాదాపు రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేసి తలకు శస్త్ర చికిత్స చేయించారు శివాజీ.