తెలంగాణ

telangana

ETV Bharat / bharat

BBC ఆఫీసుల్లో రెండోరోజూ ఐటీ 'సర్వే'.. అమెరికా కీలక వ్యాఖ్యలు! - undefined

బీబీసీ కార్యాలయాల్లో వరుసగా రెండో రోజూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని వీరు సేకరిస్తున్నారు. మరోవైపు, ఈ వ్యవహారంపై అమెరికా స్పందించింది.

IT survey on BBC India
IT survey on BBC India

By

Published : Feb 15, 2023, 10:35 AM IST

బీబీసీ ఇండియా కార్యాలయాల్లో రెండో రోజూ ఆదాయపు పన్నుశాఖ సర్వే కొనసాగుతోంది. ఎలక్ట్రానిక్‌ రూపంలో, దస్త్రాల్లో ఉన్న ఆర్థిక వ్యవహారాల సమాచారం నకలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దిల్లీ, ముంబయిల్లోని బీబీసీ ఇండియా మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు వెళ్లిన ఐటీ అధికారులు అప్పటి నుంచి అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి బీబీసీ ఉద్యోగులను ఇంటికి వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. కొన్ని కంప్యూటర్లు, ఫోన్లను స్కాన్‌ చేసినట్లు సమాచారం.

'లండన్ హెడ్ ఆఫీస్​తో పాటు భారత్​లోని కార్యాలయం బిజినెస్ ఆపరేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్ల కోసం అధికారులు వెతుకుతున్నారు. బీబీసీ అనుబంధ కంపెనీలకు సంబంధించిన ట్యాక్స్​ వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది పూర్తిగా బీబీసీ బిజినెస్ ఆపరేషన్లకు సంబంధించినదే. సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్ల నివాసాలపై ఐటీ సోదాలు జరగడం లేదు' అని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి బీబీసీ వెలువరించిన రెండు విడతల డాక్యుమెంటరీపై కక్షగట్టే ఐటీ సర్వేపేరుతో తనిఖీలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎడిటర్ గిల్డ్స్‌, అంతర్జాతీయ మీడియా సైతం ఐటీ సర్వేను తప్పుబట్టాయి. ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. బీబీసీ మాత్రం ఐటీ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు తెలిపింది.

అమెరికా స్పందన
భారత్​లో ఆదాయపు పన్ను అధికారులు బీబీసీ కార్యాలయాల్లో సర్వే చేస్తున్న విషయం గురించి తమకు అవగాహన ఉందని అమెరికా వెల్లడించింది. అయితే, దీనిపై తాము ఇప్పుడే ఎలాంటి తుది వ్యాఖ్యలు చేయలేమని పేర్కొంది. దీనిపై మరిన్ని వివరాలు భారత అధికారులే ఇవ్వగలరని తెలిపింది. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పేందుకు నిరాకరించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల వల్లే అమెరికా, భారత్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్యం బలోపేతమైందన్న విషయాన్ని గుర్తు చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details