IT Raids In Odisha :ఒడిశాలో ఆదాయపు పన్ను శాఖ జరుపుతున్న దాడుల్లో భారీగా డబ్బు బయటపడుతోంది. బోలంగీర్ జిల్లాలోని సుదాపరా ప్రాంతంలోని దేశీయ మద్యం తయారీదారుడి ఇంటిలో మరో 20 బ్యాగుల నగదును ఐటీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. మద్యం తయారుదారుడి నుంచి రికవరీ చేసుకున్న సొమ్మును లెక్కిస్తున్నామని, అది రూ.50 కోట్ల వరకు ఉంటుందని ఓ ఐటీ అధికారి అంచనా వేశారు.
"లిక్కర్ డిస్టిలరీ గ్రూప్‌పై 150 మంది అధికారులు దాడులు జరిపారు. దాడుల సమయంలో వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పత్రాల పరిశీలన కోసం హైదరాబాద్‌కు చెందిన మరో 20 మంది ఐటీ అధికారులను రప్పించాం. స్వాధీనం చేసుకున్న డబ్బు సంబల్‌పుర్, బోలంగీర్‌లోని రెండు ఎస్బీఐ బ్రాంచ్‌లలో లెక్కిస్తున్నారు. ఎక్కువగా రూ.500 నోట్లు ఉన్నాయి. అందుకే లెక్కించడం కష్టంగా మారింది. ఎక్కువ మొత్తంలో డబ్బులు లెక్కించడం వల్ల క్యాష్ కౌంటింగ్ మెషిన్లు మొరాయించాయి. అందుకే పలు బ్యాంకుల చెందిన క్యాష్ కౌంటింగ్ మెషిన్లను తెప్పించాం" అని ఐటీ అధికారి ఒకరు తెలిపారు.
ఒడిశాలోని భువనేశ్వర్, బోలంగీర్, సంబల్‌పుర్‌తోపాటు ఝార్ఖండ్‌లోని రాంచీ, బంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ ఇప్పటివరకు సోదాలు జరిగాయి. ఇప్పటివరకు 290 కోట్ల రూపాయల అక్రమ డబ్బును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోగా ఇంటెలిజెన్స్ సమాచారంతో మళ్లీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఝార్ఖండ్‌లో ఓ కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన కార్యాలయాల్లో భారీగా అక్రమ డబ్బు చిక్కింది. ఐటీ సోదాల్లో లభ్యమైన డబ్బుపై ఇప్పటికే స్పందించిన ప్రధాని మోదీ ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో వారి నుంచి సొమ్మును తిరిగి ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చారు.