Bengaluru floods : భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిచేసే కార్యాలయాలకు వెళ్లేందుకు ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ట్రాలీలో కూర్చొని ఆఫీసులకు వెళ్తున్నారు. హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న యెమలూరు వరద ధాటికి పూర్తిగా జలమయమైంది. ఈ ప్రాంతంలో అనేక మంది ఐటీ నిపుణులు నివసిస్తున్నారు. ద్విచక్రవాహనాల్లో బయటకు వెళ్లే పరిస్థితి లేని నేపథ్యంలో.. మంగళవారం వీరంతా ట్రాక్టర్లలో ఆఫీసులకు బయల్దేరారు. అయితే, ఈ ట్రాక్టర్ రైడ్ కొత్తగా ఉందని కొందరు ఐటీ నిపుణులు చెబుతున్నారు. 'సాధారణంగా మేం ఆఫీసుకు సెలవు పెట్టం. లీవ్ తీసుకుంటే మా వర్క్ దెబ్బతింటుంది. అందువల్ల ట్రాక్టర్లలో వెళ్తున్నాం. రూ.50 ఇస్తే వారు మా ఆఫీసుల వద్ద దించేస్తున్నారు' అని ఓ మహిళ ఐటీ ఉద్యోగి తెలిపారు.
Bangalore flood areas: బెంగళూరులోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మెజిస్టిక్, ఒకాలిపురం, కస్తూరనగర్‌లలో రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వర్షపు నీరు మూడు అడుగుల ఎత్తుకు చేరింది. యెమలూరు, రెయిన్‌బో డ్రైవ్ లే అవుట్, సన్నీ బ్రూక్స్ లే అవుట్, మారతహళ్లి ప్రాంతాల్లో వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ప్రజలు పడవలు, ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. బెల్లందూర్, సర్జాపుర, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, సర్జాపురా రోడ్ సహా పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఔటర్ రింగ్ రోడ్డు, సర్జాపూర్ రోడ్డులో రహదారులు సరస్సులను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీటిలో వెళ్లేందుకు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ప్రకటించగా కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు బోధిస్తున్నాయి.