CBI NOTICES TO NAVEEN: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురును విచారిస్తున్న సీబీఐ.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పని చేసే నవీన్‌కు రెండోసారి నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గత నెల 3న నవీన్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని కడపలో విచారించిన సీబీఐ.. మరోసారి నవీన్‌ను ప్రశ్నించేందుకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాదికి.. మౌఖిక సూచనలు అందాయి.
VIVEKA MURDER CASE UPDATES: గాలివీడుకు చెందిన వైసీపీ మండల అధ్యక్షుడు, న్యాయవాది సుదర్శన్ రెడ్డి గురువారం కడపలో సీబీఐ వద్దకు వచ్చారు. నవీన్‌కు నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తారనే సమాచారం తెలుసుకుని అక్కడికి వచ్చిన న్యాయవాదికి.. సీఆర్పీసీ 160 కింద సాక్షిగా మరోసారి పిలుస్తున్నట్లు సీబీఐ అధికారులు చెప్పారు. సాక్షిగా పిలిచే క్రమంలో న్యాయవాదిని అనుమతించబోమని సీబీఐ అధికారులు వెల్లడించినట్లు న్యాయవాది తెలిపారు. నవీన్‌కు నోటీసులు ఇచ్చి ఉంటారనే ప్రచారం సాగుతోంది. రెండు మూడు రోజుల్లో విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో పులివెందులకు చెందిన కొందరు అనుమానితులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగి సుధాకర్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సుధాకర్‌ను రెండు గంటల పాటు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఆయన ఇంటికి సుధాకర్ వెళ్లినట్లు తెలిసింది.
అవినాష్ రెడ్డితో ఆ రోజు ఫోటో దిగినట్లు సమాచారం. ఆ సమయంలో ఎందుకు ఫోటో దిగారన్న కోణంలో సీబీఐ అధికారులు సుధాకర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. వివేకా చనిపోయిన విషయం ఎలా తెలిసింది.. ఎవరు చెబితే అక్కడికి వచ్చారని ప్రశ్నించినట్లు తెలిసింది. విచారణ ముగిసిన తర్వాత బయటికి వచ్చిన సుధాకర్ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. ఫోటో తీసుకున్న విషయం పైనే సీబీఐ ప్రశ్నించిందని సుధాకర్ మీడియాకు తెలిపారు.
శుక్రవారం మరికొందరు అనుమానితులు, సాక్ష్యులను సీబీఐ అధికారులు.. విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వై.ఎస్.భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సీబీఐ.. ఈనెల 12న విచారణకు రావాలని సూచించారు. ఆ లోపు మిగిలిన అనుమానితుల విచారణ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Viveka Murder Case: ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి ఇంట్లో పని చేసే నవీన్‌లను కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఫిబ్రవరి 3వ తేదీన 6.30 గంటల పాటు అధికారులు విచారించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా గతంలో కృష్ణమోహన్ రెడ్డితో పాటు నవీన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ విచారణకు వీరిద్దరూ హాజరయ్యారు. వివేకా హత్య రోజు ఏం జరిగింది? ఎవరెవరు ఫోన్ చేశారు? ఏం మాట్లాడారు? మీతోనే మాట్లాడారా అనే అంశాలపై సీబీఐ ఎస్పీ రాంసింగ్ ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. నవీన్‌ను మాత్రం సీబీఐ అధికారులు రహస్యంగా విచారించినట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసు.. మరోసారి నవీన్‌కు నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ రంగం సిద్ధం..! ఇవీ చదవండి: