తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారికి కేంద్రం గుడ్​న్యూస్​- మార్చి వరకు రేషన్​ ఫ్రీ!

'ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన'ను(Free ration in india) 2022 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ నిర్ణయం అమలుతో రూ.53,344.52 కోట్ల అదనపు భారం పడనుందని పేర్కొంది.

PM Garib Kalyan Anna Yojana
ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన

By

Published : Nov 24, 2021, 3:21 PM IST

Updated : Nov 24, 2021, 6:04 PM IST

దేశంలోని పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను(Free ration scheme) అందించే.. "ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన"ను(పీఎంజీకేఏవై)(Pm garib kalyan anna yojana) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో(Union cabinet) నిర్ణయం తీసుకుంది.

"పీఎంజీకేఏవై పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలుతో ప్రభుత్వంపై రూ.53,344.52 కోట్ల భారం పడనుంది."

-అనురాగ్‌ ఠాకూర్‌, కేంద్ర సమాచార శాఖ మంత్రి.

ఐదు దశల్లో అమలు చేస్తున్న పీఎంజీకేఏవై పథకం కోసం మొత్తం రూ.2.6 లక్షల ఖర్చు చేస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్​ తెలిపారు.

కేంద్రమే భరిస్తూ..

కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది నుంచి పీఎంజీకేఏవై పథకాన్ని(Pmgkay scheme) కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఈ రేషన్‌ పంపిణీ జరుగుతోంది. ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్రమే భరిస్తూ వస్తోంది.

ఐదు దశల్లో..

గతేడాది కేంద్రం ప్రకటించిన ఈ పీఎంజీకేఏవై పథకం మొదటి దశలో భాగంగా.. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు కొనసాగింది. అప్పటికీ కరోనాతో సంక్షోభ వెంటాడుతుండటం వల్ల రెండో దశగా.. మరో ఐదు నెలల పాటు (జులై -నవంబర్‌ 2020)వరకు పొడిగించింది. ఆ తర్వాత కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ రావడం వల్ల మరోసారి మూడోదశగా రెండు నెలల పాటు (మే -జూన్‌ -2021) పొడిగించింది. ఆ తర్వాత నాలుగో దశలో భాగంగా ఐదు నెలల పాటు (జూలై నుంచి నవంబర్‌ 2021) వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ఐదో దశలో భాగంగా.. 2022 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఐదో దశలో అమలు చేయనున్న ఈ పథకంలో 163 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. నాలుగు దశల్లో భాగంగా.. ఇప్పటివరకు 600 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేసినట్లు చెప్పింది.

మరో 3.61 లక్షల ఇళ్లు..

మరోవైపు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(Pm awas yojana) కింద 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో... 3.61 లక్షల ఇళ్లను నిర్మించేందుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీంతో ఈ పథకం కింద మంజూరు చేసే ఇళ్ల సంఖ్య 1.14కోట్లకు చేరనుందని ఓ ప్రకటనలో కేంద్రం బుధవారం తెలిపింది.

కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ(Union housing and urban affairs ministry) కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్ర అధ్యక్షతన మంగళవారం సమావేశమైన సెంట్రల్​ సాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ(సీఎస్​ఎమ్​సీ) ఈ ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. "మొత్తం మంజూరు చేసిన 1.14 కోట్ల ఇళ్లలో.. 89 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. 52.5 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. వీటిని లబ్ధిదారులకు అందించాం." అని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:Cabinet meeting: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం

Last Updated : Nov 24, 2021, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details