దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ దాడులు చేపట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలపై పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పలు పార్టీలు నిధులు తప్పుగా చూపిస్తున్నాయన్న అనుమానాలతో ఈ చర్యలకు దిగినట్లు స్పష్టం చేశాయి. గుజరాత్, దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయని ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. రాజకీయ పార్టీలతో పాటు వాటితో సంబంధం ఉన్న సంస్థలు, నిర్వాహకులకు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు.
ఎన్నికల సంఘం సిఫార్సు ప్రకారం ఆదాయ పన్ను శాఖ ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈసీ 87 పార్టీలపై చర్యలు తీసుకుంది. రిజిస్టర్డ్ జాబితా నుంచి వాటిని తొలగించింది. వెరిఫికేషన్ సమయంలో వాటి జాడ తెలియలేదని తెలిపింది. రిజిస్టర్ అయి, గుర్తింపు పొందని 2,100 రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంటున్నట్లు గతంలో ప్రకటించింది. ఎన్నికల చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా ఇవి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించింది. పలుపార్టీలు తీవ్ర ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడినట్లు తెలిపింది.