తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: ముందే స్వాతంత్య్రం ప్రకటించుకొని.. - కర్ణాటకలో స్వాతంత్య్ర సమరయోధులు

1942లో గాంధీజీ క్విట్‌ ఇండియా అంటూ పిలుపిస్తే.. కర్ణాటకలోని ఓ పల్లెటూరు రైతులు ఏకంగా స్వాతంత్య్రమే ప్రకటించుకున్నారు. త్రివర్ణ పతాకం ఎగరేసి సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. స్వతంత్ర సమరంలో తమ వంతు పాత్ర పోషించారు.

Azadi Ka Amrit Mahotsav
అమృత్​ మహోత్సవ్​

By

Published : Nov 11, 2021, 7:51 AM IST

కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ఇస్సూరు గ్రామం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరచింది. గాంధీజీ క్విట్‌ ఇండియా ఉద్యమ సమయానికే గ్రామంలో పన్నుల బాధ ఎక్కువైంది. పంటలు సరిగ్గా పండకున్నా బ్రిటిష్‌ ప్రభుత్వం భారీస్థాయిలో పన్నులు విధించటంతో ఊరంతా ఆగ్రహంగా ఉంది. గాంధీజీ పిలుపు ఇచ్చిన ఊపుతో.. గ్రామస్థులు ఏకంగా పన్నులు కట్టవద్దని తీర్మానించి.. ఊరికి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ఈ విషయం తెలిస్తే.. బ్రిటిష్‌ ప్రభుత్వం వదిలిపెట్టదని తెలిసినా.. తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయించుకున్నారు. స్థానిక వీరభద్రస్వామి ఆలయం వద్ద త్రివర్ణ పతాకం ఎగరేశారు. ప్రభుత్వ అధికారులెవ్వరూ తమ గ్రామంలో అడుగుపెట్టకూడదని బోర్డులు ఏర్పాటు చేశారు. 16 సంవత్సరాల యువకులిద్దరిని తహసీల్దార్‌గా, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. తద్వారా తర్వాత ఒకవేళ బ్రిటిష్‌ అధికారులు వచ్చినా మైనర్లు అనే కారణంగా అరెస్టు చేయరనే ఉద్దేశంతో వీరికి ఈ బాధ్యతలు అప్పగించారు. బసవన్నెప్ప అనే సమరయోధుడి సారథ్యంలో గ్రామ నిర్వహణ కోసం కొన్ని నియమనిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు.

పన్నుల వసూలుకు వచ్చిన రెవెన్యూ శాఖ అధికారులు గ్రామంలో పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. పన్నులు కట్టాలని ఒత్తిడి చేయటంతో ఊరంతా తిరగబడింది. అధికారుల చేతుల్లోని కాగితాలు లాక్కొని పంపించారు. పోలీసు కేసు దాఖలు కావటంతో.. 10 మంది పోలీసుల బృందం గ్రామంలోకి దిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు గ్రామస్థులు బలవంతంగా గాంధీ టోపీలు ధరింపజేశారు. దీంతో... సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కెంచెగౌడ గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి మరింత దిగజారి.. ప్రజలు తిరగబడేలా చేసింది.

నాలుగురోజుల తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. వచ్చీరాగానే.. బ్రిటిష్‌ సైనికులు ఊరంతా లూటీ చేయటం ఆరంభించారు. అకృత్యాలకు దిగారు. ఫలితంగా జనం తిరగబడ్డారు. ఇద్దరు బ్రిటిష్‌ అధికారులు చనిపోయారు. దీంతో సైన్యం దాడి పెరిగింది. చాలామంది పారిపోయి దగ్గర్లోని అడవుల్లో దాక్కోగా.. కొంతమందిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. విచారణ అనంతరం వీరిలో ఐదుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ముగ్గురు మహిళలకు జీవితకాల శిక్ష పడింది. ఇస్సూరు తిరుగుబాటు గురించి తెలిసిన మైసూరు మహారాజు జయచామరాజ వడయార్‌ రంగంలోకి దిగి.. కావాలంటే మరికొన్ని ఊర్లిస్తాంగానీ ఇస్సూరు ఇవ్వమంటూ తేల్చిచెప్పారు. స్థానిక బ్రిటిష్‌ గవర్నర్‌తో మాట్లాడి కొంతమందికి శిక్ష తగ్గించేలా చేశారు.

ఇదీ చూడండి:ఆంగ్లేయులను ఓడించి.. స్వదేశీ ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చి..

ABOUT THE AUTHOR

...view details