విద్యుత్ సరఫరా లేకుండానే అధిక బిల్లులను ఇస్తున్నారని 12గ్రామాల ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఖోక్సా, అల్లావుద్దీన్‌పుర్, దుద్లీ, డేరా భగీరథ్, నయా బాన్స్, మస్త్‌ఘర్, జాతన్, అహ్మద్‌గఢ్, ఖేడీ తదితర గ్రామాల్లో నివసిస్తున్న బవారియా వర్గం ప్రజలు.. ఉచిత విద్యుత్ పేరుతో తమ ఇళ్లలో అధికారులు మీటర్లు బిగించారని తెలిపారు. అయితే విద్యుత్ సరఫరా లేకుండా వేలలో కరెంటు బిల్లులను ఇస్తున్నారని వాపోయారు.
మూడేళ్ల క్రితం మీటర్లు బిగించే సమయంలో ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి తమ ఉమ్మడి కుటుంబంలో విద్యుత్ మీటర్లు బిగించారని తెలిపారు. అయితే ఇటీవల విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ ఇంటికి పలుమార్లు వచ్చి ఒక్కో మీటరుకు రూ.50 వేలు డిపాజిట్ చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. ఖోక్సా గ్రామ పెద్ద భగత్ రామ్ కూడా తమ పాడుబడిన ఇంట్లో అమర్చిన మీటర్‌కు విద్యుత్ డిపార్ట్‌మెంట్ రూ.50వేల విలువైన విద్యుత్ బిల్లులను జారీ చేసిందని అన్నారు.