దేశంలో 89.51 శాతం మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ప్రస్తుతం 9.24 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య గత రికార్డులను దాటిపోయిందని తెలిపారు. కొత్త కేసులు మరింత పెరుగుతుండటం ఆందోళనకరమని అన్నారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉందని, అయితే అదే స్థాయిలో పరీక్షలు పెరగడం లేదని చెప్పారు.
"దేశంలో రోజువారీ కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు గరిష్ఠంగా ఒక రోజులో 1,114 మరణాలు సంభవించాయి. కానీ ప్రస్తుతం 879 మరణాలే నమోదయ్యాయి. మహారాష్ట్రలో సగటున 57 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. లక్ష మందికి చేసే పరీక్షల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. రోజువారీ కేసులతో పోలిస్తే టెస్టుల వేగం తక్కువగానే ఉంది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల శాతం పడిపోతోంది."
-రాజేశ్ భూషణ్, కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి
ఛత్తీస్గఢ్లో వీక్లీ పాజిటివిటీ రేటు 28 శాతానికి చేరిందని చెప్పారు భూషణ్. ఇది మరో ఆందోళనకరమైన పరిణామమని అన్నారు. యూపీలో.. సగటు కేసుల సంఖ్య 89 నుంచి పది వేలకు పెరిగిందని తెలిపారు భూషణ్. ఆర్టీ-పీసీఆర్ టెస్టుల వాటా 45 శాతంగా ఉందని చెప్పారు.