అంతరిక్షంలోకి మానవులను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్ ప్రాజక్టు నిర్వహణలో మరింత సాయం చేసేలా ఇస్రో మరో ఉపగ్రహ ప్రయోగం జరపనుంది. గగన్‌యాన్ ప్రాజక్టులో భాగంగా రోదసిలోకి పంపే ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని భూమికి చేరవేసేందుకు మరో ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది.
రూ.800 కోట్లతో చేపట్టిన గగన్‌యాన్ ప్రాజక్టులో మానవ సహిత ఉపగ్రహాన్ని ఇస్రో 2023లో ప్రయోగించనుండగా, మానవ రహిత ఉపగ్రహాన్ని 2021 డిసెంబర్‌లో రోదసిలోకి పంపనుంది. అంతకు ముందే ఇస్రో సమాచార ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టనుంది. సాధారణంగా కక్ష్యలో ఉండే ఉపగ్రహాలకు భూమి మీద ఉన్న అంతరిక్ష కేంద్రం సరిగా కనిపించకుంటే సమాచారాన్ని అక్కడకు పంపలేవు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇస్రో సమాచార ఉపగ్రహాన్ని పంపనుంది.