Chandrayaan 3 Orbit Path : జాబిల్లిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3విజయవంతంగా చంద్రుడి దిశగా పయనిస్తోంది. సకాలంలో పేలోడ్‌ను మండించి రెండోసారి కక్ష్య మార్పిడి ప్రక్రియను సోమవారం ఇస్రో చేపట్టింది. చంద్రయాన్-3 ప్రస్తుతం 41,603 కి.మీ. x 226 కి.మీ. కక్ష్యలో ఉంది. తదుపరి కక్ష్య మార్పిడి ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ఉంటుందని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-3 గమనం సజావుగా సాగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అన్ని ప్రక్రియలు సజావుగా జరిగితే ఆగస్టు 23 సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టే అవకాశముందని వెల్లడించారు.
Chandrayaan 3 Launch Date : జులై 14న 2 గంటల 34 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ను ప్రయోగించారు. దక్షిణ ధ్రువం వద్ద ల్యాండర్, రోవర్‌ను దించే లక్ష్యంతో అత్యంత శక్తిమంతమైన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌లో దీనిని ప్రయోగించింది ఇస్రో. నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్.. రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయింది. దీన్ని భూమి చుట్టూ ఉన్న 170X 36 వేల 500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెట్టింది ఇస్రో. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ 24 రోజుల పాటు తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్స్‌గా పిలుస్తారు. ఆ తర్వాత చంద్రుడి దిశగా లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్-3ని పంపిస్తారు. చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వ్యోమనౌక ప్రవేశించాక.. లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో నిర్దిష్టంగా ఇంజిన్‌ను మండించి చంద్రయాన్-3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా దాన్ని జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ఒడిసిపడుతుంది. అప్పటినుంచి అది చందమామ కక్ష్యలో తిరుగుతుంది. అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెడతారు.
Chandrayaan 3 Launch Vehicle : మొత్తంగా చంద్రయాన్-3 సుమారు 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఆగస్టు 23న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటుంది. జాబిల్లిపై ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు యాక్సెలెరోమీటర్, ఇంక్లినోమీటర్, ఆల్టీమీటర్, టచ్‌డౌన్ సెన్సర్, అవరోధాలు తప్పించుకోవడానికి కెమెరాలు తదితర సెన్సర్లు ఉంటాయి. ఇవి చంద్రయాన్-2లో పొందుపరిచిన వాటికంటే మెరుగైనవి.