ISRO Moon Mission Chandrayaan 3 : చంద్రయాన్-3 వ్యోమనౌకను జాబిలి కక్ష్యలో ప్రవేశించిన మరుసటి రోజు.. దాన్ని కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రయాన్-3 ఇప్పుడు 170x4,313 కిలోమీటర్ల కక్ష్యను చేరుకున్నట్లు తెలిపింది. తదుపరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 9న నిర్వహిస్తామని ఇస్రో ప్రకటించింది.
చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసిన చంద్రయాన్..
Chandrayaan 3 Captured Moon Images : అటు.. జాబిలికి చేరువైన చంద్రయాన్ 3 వ్యోమనౌక.. తొలిసారి చంద్రుడి ఉపరితలాన్ని తన కెమెరాలో బంధించింది. ఆ ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. శనివారం లునార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ సమయంలో ఈ ఫొటోలను చంద్రయాన్ తీసినట్లు ఇస్రో పేర్కొంది. జాబిలి కక్ష్యలో ప్రవేశించిన వెంటనే తాను చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని అనుభవిస్తున్నానని.. చంద్రయాన్ 3.. ఇస్రోకు తొలిసారి సందేశం పంపిందని వివరించింది.
జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్..
Chandrayaan 3 Lunar Orbit Injection : ఆగస్టు 5న చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన లూనార్ ఆర్బిట్ ఇంజెక్షన్ అనే కీలక విన్యాసాన్ని ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో ఇస్రో చేపట్టింది. ఫలితంగా చంద్రయాన్-3.. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది.