ISRO Gaganyaan Mission : చంద్రయాన్ 3 విజయంతో జోరు మీదున్న ఇస్రో.. తాజాగా భారత తొలి మానవరహిత అంతరిక్ష మిషన్ 'గగన్‌యాన్'కు సన్నాహాలు చేపట్టింది. ఈ మిషన్‌కు సంబంధించిన మానవరహిత ఫ్లైట్ టెస్టులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ఇస్రో. క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును ప్రదర్శించే తొలి టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1(TV-D1) ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో రాకెట్ నుంచి వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యుల్‌ను సురక్షిత దూరానికి తీసుకెళ్లడంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థ సహాయపడుతుంది.
టీవీ- డీ1 ప్రయోగంలో వినియోగించనున్న పీడన రహిత క్రూ మాడ్యుల్ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. అసలైన క్రూ మాడ్యుల్ బరువు, పరిమాణం, సంబంధిత వ్యవస్థలనే ఇది కలిగి ఉంటుందని సమాచారం. క్రూ ఎస్కేప్, క్రూ మాడ్యుల్ వ్యవస్థలతో కూడిన పేలోడ్‌లను రాకెట్ సాయంతో నింగిలోకి ప్రయోగిస్తారు. రాకెట్ ఆరోహణ దశలో గంటకు 1,481 కి.మీల వేగంతో ఉన్న సమయంలో.. అత్యవసర పరిస్థితిని కల్పిస్తారు. ఈ క్రమంలోనే భూమికి దాదాపు 17 కి.మీల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యుల్ విడిపోయి.. పారాషూట్ల సాయంతో శ్రీహరికోట తీరానికి 10 కి.మీల దూరంలో బంగాళాఖాతంలో దిగేలా ఏర్పాట్లు చేశారు.
క్రూ మాడ్యుల్‌తో కూడిన ఈ ప్రయోగాన్ని 'గగన్‌యాన్' సన్నద్ధతలో ఓ కీలక ఘట్టంగా ఇస్రో అభివర్ణించింది. ఈ ఫ్లైట్ టెస్ట్‌లో.. దాదాపు పూర్తయిన గగన్‌యాన్ వ్యవస్థలనే ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. ఇందులో సత్ఫలితాలు సాధిస్తే.. గగన్‌యాన్ ప్రయోగం దిశగా మిగిలిన అర్హత పరీక్షలు, మానవరహిత మిషన్‌లకు రంగం సిద్ధమవుతుందని వివరించింది. ఇదిలా ఉండగా.. గగన్‌యాన్‌లో ఉపయోగించే అసలైన క్రూ మాడ్యుల్ ప్రస్తుతం అభివృద్ధి దశల్లో ఉంది. టెస్ట్ వెహికల్ (రాకెట్) సైతం చివరి దశలో ఉంది. టీవీ- డీ1ని ఈ నెలాఖరులో పరీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది.