ISRO Former Chairman Sivan Comments :అంతరిక్ష పరిశోధనల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత్.. తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలను చేపడుతూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ వ్యయంతోనే అంగారక మిషన్ చేపట్టి సత్తా చాటింది. అంతరిక్ష పరిశోధనల్లో పొదుపు మంత్రంతో దూసుకెళ్తున్నా.. భవిష్యత్తులో భారీ రాకెట్లు అవసరమని ఇస్రోమాజీ ఛైర్మన్ శివన్ అభిప్రాయపడ్డారు.
Sivan Comments On ISRO Rockets :జాబిల్లిపై దిగేందుకు చంద్రయాన్-3 సిద్ధమవుతోన్న నేపథ్యంలో ఓ జాతీయ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు భారీ సామర్థ్యం కలిగిన రాకెట్లతోపాటు పెద్ద వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. కేవలం పొదుపు ఇంజినీరింగ్‌తో మనుగడ సాధించలేమని, అత్యాధునిక సాంకేతికతతోపాటు అత్యంత శక్తిమంతమైన రాకెట్లు కూడా అవసరమన్నారు. ఆ దిశగా అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇస్తూ.. ప్రభుత్వం ఇటీవల ఓ మంచి పనిచేసినట్లు శివన్ తెలిపారు. ఇప్పటికే ప్రైవేటు రంగం ఆసక్తి చూపుతోందని.. ఫలితాలు కూడా కనిపిస్తున్నాయన్నారు. త్వరలోనే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నట్లు శివన్ తెలిపారు.
ISRO Gaganyan Mission :తొలిసారి మనిషిని అంతరిక్షంలోకి తీసుకెళ్లే గగన్‌యాన్‌మిషన్‌తో భారత అంతరిక్ష ఆశయాలు మరింత ఊపందుకుంటాయని ఇస్రో మాజీ చీఫ్ శివన్ పేర్కొన్నారు. ఈ సాంకేతికత నిరూపితమైన తర్వాత.. స్పేస్ స్టేషన్ నిర్మాణం, చంద్రుడిపై శాశ్వత ఆవాసం, ఇతర అంశాల గురించి ఆలోచించవచ్చన్నారు. భారత్ ఇప్పటికే అత్యంత శక్తిమంతమైన క్రయోజెనిక్ ఇంజిన్లను తయారు చేసిందని.. అవి అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు. స్పేస్ ఎక్స్ మాదిరిగా పునర్వినియోగ రాకెట్లపై భారత్ ప్రయత్నాలు చేస్తుందా? అన్న ప్రశ్నకు శివన్ బదులిచ్చారు. ప్రస్తుతం నిట్టనిలువుగా ల్యాండింగయ్యే ప్రక్రియపై ప్రయోగాలు జరుగుతున్నట్లు చెప్పారు.
Isro Chandrayaan 3 Lander Module :చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా.. LPDC తీసిన జాబిల్లి చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ఆగస్టు 15, 17వ తేదీల్లో ఈ చంద్రుని చిత్రాలను LPDC తీసింది. గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత తీసిన చంద్రుని చిత్రాలను ఇస్రో..సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ల్యాండర్ మాడ్యూల్‌లో ఉన్న కెమెరాతో తీసిన ఈ చిత్రాల్లో ప్రొపల్షన్ మాడ్యూల్‌తో పాటు చంద్రునిపై వివిధ ప్రదేశాలను చూడవచ్చు. ఆ చిత్రాలు చూసేందుకు ఈ లింక్‌పైక్లిక్ చేయండి.