ISRO Exam Cheating Case : కేరళలో ఇస్రో ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల చీటింగ్కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 'విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం' (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి చీటింగ్ చేశారు కొందరు అభ్యర్థులు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఎలక్ట్రానిక్ వస్తువును రూపొందించారు. దీంతో పాటు కెమెరా లెన్స్‌లు కనపడకుండా ఉండేలా దుస్తులను ప్రత్యేకంగా కుట్టించారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ చీటింగ్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన తిరువనంతపురం పోలీస్ కమిషనర్ నాగరాజు.. కేసు వివరాలను వివరించారు. బటన్‌లో పెట్టిన కెమెరాలతో ప్రశ్నలను స్కాన్ చేసి ఎక్కడికో పంపించి, చెవిలో అమర్చుకున్న పరికరంతో సమాధానాలు విని పరీక్షలు రాశారని చెప్పారు. ఆ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తామని వివరించారు. ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు హరియాణావాసులను అరెస్ట్ చేసినట్లు కమిషనర్ చెప్పారు.
"ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ వస్తువుతో పాటు ఇయర్ పీస్, కెమెరా లెన్స్‌లు ఉపయోగించారు. కెమెరా లెన్స్‌లు కనిపించకుండా ఉండేందుకు చొక్కా బటన్లలో వీటిని పెట్టారు. వీరి నైపుణ్యం చూస్తే.. తొలిసారి చేసిన వాళ్లు కాదని.. ఇప్పటికే అనేక సార్లు చేసినట్లు అర్థం అవుతోంది. ఈ ఎలక్ట్రానిక్ వస్తువు ఏ బ్రాండ్‌కు చెందినవి కావు. వీటిని ప్రత్యేకంగా దీనికోసమే ఓ సాంకేతిక నిపుణుడి సాయంతో రూపొందించారు. ఈ కేసు భారీ నగదుతో ముడిపడి ఉంది. నిందితులు పరీక్షకు ముందురోజు విమానంలో వచ్చారు. వీరంతా పక్కా ప్రణాళికతో ఇక్కడకు వచ్చారు."
--నాగరాజు, తిరువనంతపురం పోలీస్ కమిషనర్