ISRO Chairman Somanath on Shivashakti Point :చంద్రుని దక్షిణ ధ్రువానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు తమ వద్ద ఉన్నాయని ఇస్రో చీఫ్ ఎస్ సోమ్‌నాథ్ తెలిపారు. ఇప్పటి వరకు ఇతర దేశాల వద్ద ఉన్న వాటితో పోలిస్తే ఇస్రో వద్ద అత్యుత్తమ ఫొటోలు ఉన్నాయని చెప్పారు. ప్రజ్ఞాన్ రోవర్ చక్కటి డేటాను అందిస్తోందని వివరించారు. ఫొటోలన్నీ ఇస్రో కంప్యూటర్ సెంటర్‌కు వెళుతున్నాయని, వాటిని తమ శాస్త్రవేత్తలు ప్రాసెస్ చేస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే వాటిని బయటపెట్టనున్నట్లు చెప్పారు. రాబోయే 10 రోజుల్లో వివిధ మోడ్లలో నిర్ణయించుకున్న అన్ని ప్రయోగాలను మొత్తం సామర్థ్యంతో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం ల్యాండర్, రోవర్‌ల పనితీరు చాలా బాగుందని స్పష్టం చేశారు. బోర్డులో ఉన్న 5 పరికరాలను స్విచ్ ఆన్ చేసినట్లు చెప్పారు.
Chandrayaan 3 Photos of Moon Isro :"రానున్న రోజుల్లో వివిధ పద్ధతుల్లో పరీక్షలు జరపాలి. రోవర్ వేర్వేరు ప్రదేశాల్లో అధ్యయనాలు జరపాలి. మినరాజికల్ నిర్ధరణ జరపాల్సి వచ్చినప్పుడు రోవర్ కచ్చితంగా వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతమంతా తిరిగి ప్రయోగాలు జరిపి ఆ డేటాను ఇక్కడకు పంపించాలి. చాలా ఫొటోలను తీయాల్సి ఉంటుంది. ఇస్రో దగ్గర చంద్రునికి సంబంధించిన బెస్ట్ ఫొటోలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా ఎవరి దగ్గర లేని దొరకని విశేషమైన ఫొటోలు ఉన్నాయి. వాటన్నింటినీ మెల్లమెల్లగా విడుదల చేస్తాము. అవన్నీ ఇస్రో కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లాలి." అని ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ అన్నారు. శాస్త్రవేత్తలు వాటిని పరిశోధన చేస్తున్నారని.. వాటి కోసమే తాము వేచి చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.