Isro Aditya L1 Mission Reach Date : సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య L1 తన ప్రయాణంలో తుది అంకానికి చేరువైంది. జనవరి 6 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్‌కు ఆదిత్య L1 చేరుకుంటుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఓ ఎన్జీఓ నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు. ఐదేళ్లపాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని ఆదిత్య L1 సేకరిస్తుందన్నారు సోమ్‌నాథ్. సూర్యుడిలో వచ్చే మార్పులు మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు. అలాగే భారత స్పేస్ స్టేషన్‌ను నిర్మించేందుకు ఇస్రో ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు.
"ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎల్1 పాయింట్‌కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్‌ను మండించాలి. అది మరింత ముందుకు వెళ్లకుండా చేసేందుకు ఇది చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకియ వల్ల స్పేస్‌క్రాఫ్ట్ ఎల్1 పాయింట్ వద్దకు చేరుకుని దాని చుట్టూ తిరుగుతుంది. అది విజయవంతంగా ఆ పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే ఐదేళ్ల పాటు కక్ష్యలో తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. భారత్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు సూర్యుని డైనమిక్స్, అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ డేటా చాలా ఉపయోగకరంగా ఉంటుంది."
--ఎస్. సోమ్‌నాథ్, ఇస్రో ఛైర్మన్