ISRO Aditya L1 Mission Launch Date In India :చంద్రయాన్-3 మిషన్ విజయవంతం చేసిన ఇస్రో తదుపరి ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధన కోసం సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1ను ప్రయోగించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ ఎల్-1 వద్ద ఈ వ్యోమనౌకను మోహరించనున్నారు. సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేయనుంది.
Aditya L1 Launch Vehicle :ఆదిత్య ఎల్-1ను వివిధ జాతీయ సంస్థల భాగస్వామ్యంతో దేశీయంగానే తయారు చేసినట్లు ఇస్రోకుచెందిన ఓ అధికారి తెలిపారు. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి రెండు వారాల క్రితమే ఉపగ్రహం శ్రీహరికోటకు చేరుకుందని చెప్పారు. ఎల్-1 పాయింట్ వద్ద ఉపగ్రహాన్ని మోహరించడం వల్ల గ్రహణం వంటి అవాంతరాలు లేకుండా సూర్యున్ని నిరంతరం వీక్షించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
ISRO Aditya L1 Mission Details : సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. ఉపగ్రహం బరువు 1,500 కిలోలు. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో.. ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనుంది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1.. చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది.