ISRO Aditya L1 Mission Launch Date In India :చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ తర్వాత ఇస్రో మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధన కోసం సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగం నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది.
Aditya L1 Launch Vehicle :ఆదిత్య ఎల్-1ను పీఎస్‌ఎల్‌వీ-సి57 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఆదిత్య ఎల్-1 ప్రాజెక్టు ఉద్దేశం. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలో ఈ వ్యోమనౌకను ప్రవేశపెట్టనున్నారు. సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేయనుంది. ఆదిత్య ఎల్-1ను వివిధ జాతీయ సంస్థల భాగస్వామ్యంతో దేశీయంగానే తయారు చేసినట్లు ఇస్రోకు చెందిన ఓ అధికారి తెలిపారు.
సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇదే. 1500 కిలోల బరువున్న శాటిలైట్ ఇది. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు. ఆదిత్య-ఎల్ 1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్‌తో పాటు సోలార్ అవైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్-లో-ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్‌లను అమర్చనున్నారు.