ISRO Aditya L1 Mission :2023లో ఇప్పటికే ఆరు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఇటీవలే చంద్రుడిపై గుట్టును తెలుసుకునేందుకు చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నెల 23 వ తేదీన చంద్రయాన్-3 ల్యాండర్..జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగనుంది. ఈ ప్రయోగం జరుగుతుండగానే ఇతర ప్రయోగాలపై ఇస్రో దృష్టి కేంద్రీకరించింది.
Aditya-L1 Launch Vehicle :తొలిసారి సూర్యుడిపై ప్రయోగాలు చేసేందుకు ఆదిత్య-ఎల్1 రాకెట్‌ను ప్రయోగించనుంది. PSLV C57 రాకెట్ ద్వారా ఆదిత్య-ఎల్1 ను సూర్యుడి వద్దకు పంపించి పరిశోధనలు చేయనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య L1 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆదిత్య-ఎల్1ను బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్‌లో తయారు చేయగా.. అక్కడి నుంచి సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌కు భారీ భద్రత మధ్య తరలించారు.
Aditya-L1 Launch Date And Time :సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. ఉపగ్రహం బరువు 1500 కిలోలు. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో.. ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చేపట్టనుంది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1.. చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది.
Aditya L1 Mission Manufacturers : ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ VELCతో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్‌లను అమర్చనున్నారు.
ISRO Aditya L1 Sun Mission : సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి వెలుపలి పొరలు, సౌరశక్తి కణాలు, సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించనున్నాయి. ఆదిత్య-ఎల్1లోని నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు ఎల్1 వద్ద కణాలు, క్షేత్రాల అధ్యయనాలు నిర్వహిస్తాయి.