Israel Palestine War :ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. పాలస్తీనా ప్రజలకు విపక్ష కూటమి 'ఇండియా' నేతలు సంఘీభావం తెలిపారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీ ఖాన్, జేడీయూ నేత కేసీ త్యాగి, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ తదితరులు దిల్లీలోని పాలస్తీనా కార్యాలయానికి సోమవారం వెళ్లారు.
Israel Vs Palestine : గాజాలో మానవతా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని తెలిపేందుకు ఆ దేశ రాయబార కార్యాలయానికి వచ్చినట్లు సీపీఐ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య మీడియాకు తెలిపారు. "దేశంలోని ప్రతి చోట.. మేము ప్రజలతో గొంతు కలుపుతున్నాం. శాంతి కోసం ఎప్పుడూ గట్టిగానే పోరాడాలి. గాజాలో జరుగుతున్నది కేవలం విచక్షణారహిత దాడులు మాత్రమే కాదు. మూడో ప్రపంచ యుద్ధానికి పలు దేశాల్ని నెడుతోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్- బీజేపీ మాటల యుద్ధం!
Congress On Israel Palestine Conflict :ఇటీవలే జరిగిన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయ మండలి- CWC భేటీలో పాలస్తీనా పక్షాన నిలుస్తూ హస్తం పార్టీ తీర్మానం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో పాలస్తీనా ప్రజల హక్కులకు, వారి స్వయంపాలనకు తాము మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఇజ్రాయెల్ జాతీయ భద్రతా ఆందోళనలకు భరోసా ఇస్తూ చర్చల ద్వారా పాలస్తీనా ప్రజల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.