isolation rules for foreigners: ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఐసోలేషన్ నిబంధనలను మార్చింది కేంద్రం. ఎయిర్‌పోర్ట్‌లో జరిపిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం తప్పనిసరి కాదని తెలిపింది. వారు సాధారణ కొవిడ్ ప్రోటోకాల్ అనుసరిస్తే సరిపోతుందని పేర్కొంది.
ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది. కొత్త నిబంధనలు జనవరి 22న అమలులోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు వీటినే అమలు చేయాలని అధికారులకు సూచించింది. అయితే సవరించిన మార్గదర్శకాలలో మిగిలిన నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి కూడా తాజా నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం. స్క్రీనింగ్ సమయంలో వైరస్ లక్షణాలను గుర్తించినట్లైతే ఆ ప్రయాణికులు వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లాలని కొవిడ్ ప్రొటోకాల్ చెబుతోంది. అంతేగాకుండా వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను కూడా గుర్తించి పరీక్షలు నిర్వహించాలి.