Islamic radicals in Hyderabad : హైదరాబాద్‌లో ఆరుగురు ఇస్లామిక్ రాడికల్స్ పట్టుబడటంతో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. నిందితుల్లో భోపాల్‌కు చెందిన మహ్మద్ సలీం, ఒడిశాకు చెందిన అబ్దుర్ రహమాన్‌తో పాటు నగరానికి చెందిన ఆరుగురున్నారు. ముగ్గురు నిందితులు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారి, ఆ తర్వాత ఇస్లామిక్ రాడికల్స్‌గా మారడం గురించి ఆరా తీస్తున్నారు. భోపాల్ కు చెందిన సౌబర్ రాజ్ వైద్య.. 2010లో ఇస్లాం మతంలోకి మారి మహ్మద్ సలీంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. వివాహం అయిన తర్వాత కొన్నాళ్లకు ముస్లింగా మారిన సలీం... ఆ తర్వాత తన భార్యను కూడా మతం మార్చినట్లు గుర్తించారు. 2018లో హైదరాబాద్‌కు వచ్చిన సలీం దంపతులు... గోల్కొండలో ఉంటున్నట్లు తేల్చారు.
హైదరాబాద్‌లో ఇస్లామిక్ రాడికల్స్ : ఒడిశాకు చెందిన దేవిప్రసాద్ సైతం అబ్దుల్ రహమాన్‌గా మారాడని... క్లౌడ్ సర్వీస్ ఇంజినీర్‌గా పనిచేస్తూ సలీం ఉన్న కాలనీలోనే నివాసం ఉంటున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న సల్మాన్‌ను సైతం కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకొని మధ్యప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులకు అప్పజెప్పారు.
జవహర్‌నగర్, బాలాజీనగర్‌లోని శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న సల్మాన్... టీవీ, సెల్‌ఫోన్ మరమ్మతులు చేస్తున్నట్లు అతని సోదరి తెలిపారు. జగద్గిరిగుట్టకు చెందిన మహ్మద్ హమీద్, సల్మాన్ స్నేహితులను పోలీసులు గుర్తించారు. సల్మాన్ ద్వారా హమీద్ ఇస్లామిక్ రాడికల్‌గా మారినట్లు గుర్తించారు. సల్మాన్ ఇంటికి ఉన్న సీసీటీవీ కెమెరాల డేటాను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని, ఆయన ఇంటికి ఎవరెవరు వచ్చిపోయారనే వివరాలు సేకరిస్తున్నారు.