ISKCON Temple Abids History and Timings Details Telugu: శ్రీ కృష్ణ జన్మాష్టమి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లోని ఇస్కాన్ ఆలయాల్లో సందడి నెలకొంటుంది. పండుగ సందర్భంగా.. కృష్ణుడిని ధ్యానిస్తూ భక్తులు భజనలు, పూజా కార్యక్రమాల్లో మునిగితేలుతారు. అందమైన అలంకరణతో ముస్తాబయ్యే ఈ ఆలయాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఈ పండుగ రోజున ప్రత్యేకత ఏమిటంటే.. చిన్నారి బాలలు కృష్ణుడి వేషంలో ముద్దులొలుకుతారు. కృష్ణాష్టమి పురస్కరించుకుని హైదరాబాదులోని అబిడ్స్ ఇస్కాన్ ఆలయం వేలాది మంది భక్తులతో పోటెత్తుతోంది. ఈ పర్వదినం వేళ.. అబిడ్స్ ఆలయ చరిత్ర.. దర్శన సమయం.. అక్కడకు ఎలా చేరుకోవాలి..? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Architecture of ISKCON Hyderabad:ఇస్కాన్ దేవాలయాలు భారతదేశంలోని అత్యంత అందమైన ఆధ్యాత్మిక, మతపరమైన కేంద్రాలు. హైదరాబాద్‌లోని ఇస్కాన్ దేవాలయం కూడా అలాంటిదే. ఇస్కాన్ అబిడ్స్ ఆలయాన్ని.. శ్రీ రాధా మదన మోహన ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది శ్రీకృష్ణునికి అంకితం అయ్యింది. అయితే.. ఇందులో శ్రీ గౌర-నితై, శ్రీ జగన్నాథ బలదేవ-సుభద్ర, శ్రీ రాధా మదన-మోహన వంటి ఇతర దేవతావిగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో రోజువారీ హారతులు నిర్వహిస్తారు.
చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం ఆలయానికి వస్తుంటారు. ఆ టెంపుల్.. నగరంలో అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. రోజువారీ మతపరమైన ఆచారాలతో పాటు, ఇస్కాన్ ఆలయం ప్రత్యేక భక్తి ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక సెషన్‌లను కూడా నిర్వహిస్తుంది. ఈ ఆలయం దక్షిణ భారత దేవాలయాల సంప్రదాయ శైలితో ఆధునిక నిర్మాణ శైలిని మిళితం చేస్తుంది. ఆలయ భవనం చుట్టూ పచ్చని తోటలు, కాంప్లెక్స్‌లో అనేక నీటి ఫౌంటెన్‌లు కూడా ఉన్నాయి. ఇవి ఆలయాన్ని మరింత అందంగా, అద్భుతంగా కనిపించేలా చేస్తాయి.
భక్తజన కోలాహలం వైభవంగా జగన్నాథ రథయాత్ర
ఇస్కాన్ దేవాలయం చరిత్ర:
History of ISKCON Temple Abids Hyderabad:అబిడ్స్‌లోని ఇస్కాన్ దేవాలయం 1970ల చివరలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఒక ఆకర్షణీయమైన చరిత్రను కలిగి ఉంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) సంస్థ.. ఆధ్యాత్మిక జ్ఞానం, స్వీయ-సాక్షాత్కారం లక్ష్యంతో ఆలయాన్ని స్థాపించింది. హరే కృష్ణ ఉద్యమంగా ప్రసిద్ధి చెందిన ఇస్కాన్.. 1966లో న్యూయార్క్ నగరంలో AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద ఆధ్వర్యంలో స్థాపించారు. ఇస్కాన్ భక్తులు మహా మంత్ర రూపంలో శ్రీకృష్ణ నామాలను జపిస్తారు. ప్రస్తుతం.. ప్రపంచవ్యాప్తంగా 800 కంటే ఎక్కువ ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి. అబిడ్స్‌లోని ఇస్కాన్ దేవాలయం దక్షిణ భారతదేశంలోని మొదటి ఇస్కాన్ కేంద్రాలలో ఒకటిగా స్థాపించబడింది.
హైదరాబాద్ ఇస్కాన్ ఆలయంలో చేయవలసినవి:
Things to do at Hyderabad ISKCON Temple:ప్రజలు.. శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి ఇక్కడికి వస్తారు. ఈ దేవాలయంలోని మరో ప్రధాన ఆకర్షణ భక్తి వృక్ష కేంద్రం. ఇస్కాన్ భక్తులు నిత్యం హరినామ్ సంకీర్తన జపిస్తారు. హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్లో కూడా వివిధ పండుగలు ఉత్సాహంగా జరుగుతాయి. జన్మాష్టమి, జగన్నాథ రథయాత్ర, రామ నవమి ఇక్కడ జరుపుకునే వాటిలో ప్రసిద్ధి చెందినవి. హైదరాబాద్‌లోని ఇస్కాన్‌లో సందర్శించడానికి కొన్ని ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్రాంగణంలోని దుకాణం నుంచి.. మీరు ఇస్కాన్‌కు సంబంధించిన వివిధ వేద పుస్తకాలు, ఇతర సాహిత్యాలను పొందవచ్చు. తినడానికి స్నాక్స్, విలాసవంతమైన శాఖాహార భోజనం చేయగల రెస్టారెంట్ కూడా ఉంది. ఆలయంలో అతిథి గృహం కూడా ఉంది, భక్తులు కావాలనుకుంటే ఇక్కడ బస చేయవచ్చు.