ISIS behind Hijab issue: హిజాబ్ వివాదంలో అంతర్జాతీయ సంస్థల పాత్ర ఉందని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ ఆరోపించారు. దీనికి ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు.
Hijab issue ISIS
"విదేశీ సంస్థల కుట్ర ఇందులో దాగి ఉంది. ఉడుపిలో ప్రారంభమైన నిరసనలు అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్తాయి. ఇంత వేగంగా నిరసనలు వ్యాపించేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఐసిస్, కేఎఫ్డీ(కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ) సంస్థలే ఈ నిరసనలను నడిపిస్తున్నాయి. హిజాబ్ విషయమై నిరసనలు చేపట్టాలని స్థానిక సంస్థలను ఐసిస్ కోరింది."
-అశోక్, కర్ణాటక మంత్రి
ISIS Hijab Minister Ashok
పిల్లలు స్కూళ్లకు వెళ్లి చదువుకోవాలే కానీ.. ఇలాంటి మతపరమైన వివాదాల్లో భాగం కావొద్దని మంత్రి హితవు పలికారు. 'మీరు మీ ఇళ్లలో ఏమైనా చేసుకోండి. కాలేజీలు, స్కూళ్లలో మాత్రం చదువులపైనే దృష్టిపెట్టాలి. ఈ వివాదంలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి మేం ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. దశలవారీగా తగిన చర్యలు తీసుకుంటాం. హిజాబ్ వివాదంపై సమగ్రవిచారణ జరగాల్సి ఉంది. దీనిపై సీఎంతో నేను మాట్లాడతా. ఈ కుట్ర వెనక ఉన్న ఉగ్రవాదులను వెలుగులోకి తీసుకురావాలి' అని అన్నారు.
సద్దుమణగని వివాదం
మరోవైపు, కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. విద్యాసంస్థల్లో యూనిఫాం నిబంధన తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు హిజాబ్ ధరిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బెళగావి జిల్లాలోని విజయ పారా వైద్య కళాశాలకు నిరవధిక సెలవులు ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక, శివమొగ్గ జిల్లా శిరాలకొప్పాలోని ప్రభుత్వ ప్రీయూనివర్సిటీ కళాశాలలో శనివారం.. హిజాబ్ ధరించిన 58 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీంతో కళాశాల ముందు ఆందోళనకు దిగారు విద్యార్థులు. తమను తరగతులకు అనుమతించాలని డిమాండ్ చేశారు. తుముకూరు జిల్లాలో 20 మంది విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజునే ఈ సంఘటన జరగటం గమనార్హం.
ఇదీ చదవండి:పీకేతో నితీశ్ కుమార్ డిన్నర్.. ఆంతర్యమేంటో..?