అసోం, త్రిపుర, గోవా సహా ఉత్తర్‌ప్రదేశ్‌లో సంస్థాగతంగా బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది తృణమూల్ కాంగ్రెస్. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను బలహీనపరిచి తమ పునాదులు నిర్మించుకోవాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. అందుకే హస్తం పార్టీ నేతలను ఒక్కొక్కరిగా తమ పార్టీలోకి చేర్చుకుంటోంది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ పార్టీలోని కీలక నేతలు ఇటీవలే టీఎంసీలో చేరారు. భాజపాను గద్దె దించేందుకు మమతతో కలిసి పోరాడుతామని వారు చెప్పడం యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలినట్లయింది. దీనిపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అసోం కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుష్మితా దేవ్ కూడా కొద్ది రోజుల క్రితం తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరారు. 30 ఏళ్ల పాటు సేవలందించిన ఆమె పార్టీని వీడడం హస్తం పార్టీకి నష్టమనే చెప్పాలి. దీనికి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గోవా మాజీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే లుయీజిన్హో ఫలేరో కూడా ఇటీవలే టీఎంసీలో చేరారు. భాజపాపై పోరాడేందుకు మమతా బెనర్జే సమర్థవంతమైన నాయకురాలని ఆయన అన్నారు. ఆయనతో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా తృణమూల్ కండువా కప్పుకున్నారు.
అయితే 2024 ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు బలమైన ప్రతిపక్ష కూటమి అవసరమని, అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇప్పుడు ఆమే కాంగ్రెస్‌ను బలహీన పరిచే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. దీంతో కూటమి ధర్మంలో ఇలాంటి రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు? అనే ప్రశ్నలు సాధారణంగానే ఉత్పన్నమవుతున్నాయి.
అప్పుడు భాజపా... ఇప్పుడు టీఎంసీ...
సంస్థాగతంగా బలంగా లేకుండా కేవలం ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించి ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యమని ఈ ఏడాది జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ఈ ఎన్నికలకు ముందు భాజపా.. ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా చేర్చుకుంది. ప్రత్యేకించి టీఎంసీ నాయకులను పార్టీలోకి పెద్దఎత్తున ఆహ్వానించింది. వారికే టికెట్లు కూడా ఇచ్చింది. అయితే ఈ వ్యూహంతో సానుకూల ఫలితాలు మాత్రం రాబట్టుకోలేకపోయింది. ఇప్పుడు పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నాయకులకు గాలం వేస్తోంది. ప్రత్యేకించి కాంగ్రెస్‌లో పెద్ద పెద్ద నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది.
రాజకీయ నాయకులు పార్టీలు మారడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయిందని కలకత్తా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రాజగోపాల్ ధార్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. అయితే ఈ సంస్కృతికి మూలాలు మాత్రం ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉన్నాయని చెప్పారు. అక్కడ పార్టీలు ఫిరాయించిన ప్రజాప్రతినిధుల వల్ల ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.
" ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి చేర్చుకునే విషయంలో తృణమూల్ కాంగ్రెస్ భాజపాపై కాకుండా కాంగ్రెస్‌పై ఎందుకు దృష్టి సారించిందని అధీర్ రంజన్ చౌధరి ప్రశ్నించారు? ఆయనతో నేను ఏకీభవిస్తాను. కాంగ్రెస్ బలహీన పరుస్తూ బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఈ చర్యలతో కూటమి రాజకీయ స్ఫూర్తిపై ప్రశ్నలు తలెత్తుతాయి"
-రాజగోపాల్ ధార్ చక్రవర్తి
కాంగ్రెస్‌కు సొంత బలహీనత
కాంగ్రెస్ పార్టీకి సొంత బలహీనత ఉందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, ప్రెసిడెన్సీ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డా.అమల్ కుమార్ ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. అంతర్గత కుమ్ములాటలే ఆ పార్టీకి అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు.