తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పాలక, విపక్షాలు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నాయి. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌తో డీఎంకే జట్టుకట్టగా.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో ఎన్నికల బరిలోకి దిగుతోంది అధికార అన్నాడీఎంకే. తమిళనాడులో దశాబ్దాలుగా ద్విముఖ పోరే నడుస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ రంగ ప్రవేశంతో ఈ ఆనవాయితీకి తెరపడుతుందని భావించినప్పటికీ.. తలైవా వెనక్కి తగ్గడం వల్ల ఇందుకు ఆస్కారం లేకుండా పోయింది. మరోవైపు, 2018లోనే పార్టీని ప్రారంభించి గత సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రపు ఓట్లను దక్కించుకున్న కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం... ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) అమలు చేసిన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:35 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ కాంబో!
కేరళ సీఎం పినరయి విజయన్ను కమల్ తన రాజకీయ గురువుగా భావిస్తారు. ఇదే విషయాన్ని గతంలో బహిరంగంగా వెల్లడించారు కూడా. ఇప్పుడు ఆయన గురువు దారిలోనే నడిచి విజయాన్ని అందుకోవాలని కమల్ తాపత్రయపడుతున్నారు.
ఏంటా వ్యూహం?
గతేడాది డిసెంబర్లో కేరళలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎల్డీఎఫ్ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ప్రజల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులను, వివిధ రంగాలకు చెందిన నిపుణులను, పబ్లిక్ సర్వెంట్లను ఉపయోగించుకొని ఓటర్లను ఆకర్షించింది ఎల్డీఎఫ్. ఇప్పుడు కమల్ హాసన్ సైతం ఇదే దారిలో వెళ్తున్నారు. పదవిలో ఉండగా ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేసిన ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు ఇతర ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించారు.
ఇదీ చదవండి:కమల్‌కు ఊరట.. పార్టీకి టార్చ్ గుర్తు
విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏజీ మౌర్యకు ఇటీవలే పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు కమల్. ఐఏఎస్ అధికారి డా. సంతోష్ కుమార్ సైతం స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకొని కమల్ పార్టీలో చేరారు. మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాంకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పొన్‌రాజ్‌తో పాటు వీఆర్ఎస్ తీసుకున్న మరో ఐఏఎస్ అధికారి సఘాయమ్ను పార్టీలోకి ఆహ్వానించారు కమల్.
ఇదీ చదవండి:కమల్ నోట 'థర్డ్ ఫ్రంట్' మాట
కార్యకర్తలు, సంస్థలతోనూ
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అరాప్పోర్ ఇయాక్కమ్, పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడే 'పూవులాగిన్ నన్‌బార్గల్' సంస్థతోనూ కమల్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా మంచి పేరున్న వ్యక్తులు, ప్రముఖులతోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.