ఎన్నికలేవైనా, ఏ దేశమైనా ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్‌కు విశేష ప్రజాదరణ ఉంటుంది. అయితే ఇవి కొన్నిసార్లు అంచనాకు తగ్గట్లు నిజమవుతున్నా.. మరి కొన్ని సందర్భాల్లో ఓటరు నాడి పట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఇందుకు తాజా బిహార్ అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యంగా నిలిచాయి.
ఎన్డీఏకే ఓటు...
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికే విజయావకాశాలు ఉన్నాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే ఫలితం ఇందుకు భిన్నంగా వచ్చింది. అత్యధిక స్థానాలను అధికార ఎన్డీఏ చేజిక్కించుకుంది. ముఖ్యంగా భాజపా ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఎగ్జిట్ పోల్స్ ఏమన్నాయి...
మరోసారి ఎగ్జిట్ పోల్స్ విఫలం- ఎన్డీఏకే బిహార్ పట్టం ఇంతకుముందు...
2019 సార్వత్రికంలో అంచనాలకు మించి...
2019 సాధారణ ఎన్నికలు ముగిసిన రోజే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదలయ్యాయి. రెండోసారి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏనే మరోమారు అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి పలు సర్వే సంస్థలు. సుమారు 300 పైచిలుకు సీట్లు సాధిస్తుందని తెలిపాయి. కానీ ఏబీపీ న్యూస్, నేత న్యూస్ ఎక్స్ మాత్రమే అధికార కూటమికి మెజారిటీ తగ్గిపోతుందని తెలిపాయి. ఎన్డీఏకు 267 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ చెప్పగా, న్యూస్ ఎక్స్ 242 వస్తాయని తెలిపింది.
అయితే... భాజపా ఇంకా అంచనాలకు మించి అధిక స్థానాలతో సొంతంగానే మెజార్టీ సాధించింది. ఎన్డీఏ కూటమి 353 స్థానాలు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 కంటే 21 సీట్లు అధికంగా గెలిచి భాజపానే ఆధిపత్యం చెలాయించింది. యూపీఏ 90 సీట్లకే పరిమితమైంది.
2014 ఎగ్జిట్ పోల్స్..
2014లో మొత్తం 7 సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించగా అందులో న్యూస్-24 చాణక్య మాత్రమే దాదాపు కచ్చితమైన ఫలితాలను అంచనా వేయగలిగింది. ఎన్డీఏకు 340 సీట్లు వస్తాయని పేర్కొనగా.. అప్పటి ఎన్నికల్లో 336 సీట్లు వచ్చాయి. యూపీఏకి 70 సీట్లు అంచనా వేయగా 59 సీట్లు వచ్చాయి.
2004, 2009 విఫలం..
2004, 2009 ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. యూపీఏ, ఎన్డీఏల మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. రెండు సార్లూ యూపీఏ సునాయాసంగానే అధికారం చేజిక్కించుకుంది.
2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సునామీ సృష్టించిన ఏడాది తర్వాత దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాజపా, ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ కొదమ సింహాల్లా గర్జించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న దిల్లీలో ఆప్ 40-45 సీట్ల వరకు గెలుస్తుందనుకున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో... వాటిని తలకిందులు చేస్తూ ఆప్ 70కి 67 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది.
బిహార్‌లోనూ అంతే...
2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ భాజపా, జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ మహాకూటమి మధ్యే. 243 అసెంబ్లీ స్థానాల్లో ఎగ్జిట్ పోల్స్ భాజపాకు 100+ వస్తాయని, మహాకూటమి.. కాషాయ పార్టీ వెనుక ఉండొచ్చని అంచనా వేశాయి. అయితే ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. ఎన్డీఏ 58 సీట్లకే పరిమితమైంది. జేడీయూ, ఆర్ఎల్డీ నేతృత్వంలోని మహాకూటమి 178 సీట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక్కడా ఎగ్జిట్ పోల్స్ ఓటరు నాడి పట్టుకోలేకపోయాయి.
ఎగ్జిట్ పోల్స్‌లో గెలిచి.. ఫలితాల్లో ఓడారు..
2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపు తథ్యమని ఎగ్జిట్ పోల్స్ కోడై కూశాయి. 543 లోక్‌సభ సీట్లలో 230- 275 స్థానాలు ఎన్డీఏకు వస్తాయని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. ఫలితాల్లో మాత్రం యూపీఏ 218 గెల్చుకుని ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అలా అని నమ్మకుండా ఉండలేం...
ఈ సందర్భాలన్నింటా ఎగ్జిట్ పోల్స్ విఫలమయినంత మాత్రాన మొత్తానికి నమ్మకూడదు అని చెప్పలేం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ సఫలమయ్యాయి.
అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం కొద్ది శాతం మంది ప్రజల అభిప్రాయ సేకరణ మాత్రమేనన్న విషయాన్ని ఓటర్లు సహా నేతలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల పరిస్థితులు, వాతావరణాన్ని అంచనా వేయగలవే గాని ఓటర్ల మనసులో ఏముందో ఏ ఎగ్జిట్ పోల్స్ చెప్పలేవు.