కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య పెరుగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. యువ నేతలు వరుసగా పార్టీని వీడటమే ఇందుకు నిదర్శనం. 2022లో ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో జితిన్ ప్రసాద పార్టీ మారటం కాంగ్రెస్కు పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఆయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జితిన్ ప్రసాద భాజపాలో చేరటం.. కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి అసంతృప్త యువ నేతలు పార్టీలో తమకు భవిష్యత్తు లేదనే భావనకు వస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదే.. పార్టీని వీడేందుకు కారణమవుతోంది. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల బృందంలో జితిన్ ప్రసాద ఒకరు. పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయటం సహా సంస్థాగత మార్పులు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
జితిన్ తర్వాత ఎవరు?
రాహుల్ గాంధీ బృందంలో కీలకంగా ఉన్న వారిలో జోతిరాదిత్య సింధియా తర్వాత పార్టీ మారిన ప్రముఖ యువ నేత జితిన్ ప్రసాద. అయితే.. ఇక్కడితో ఆ జాబితా ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. పార్టీ వ్యవహారాలపై సచిన్ పైలట్, మిళింద్ దేవ్రా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
జితిన్ ప్రసాద పార్టీ వీడిన మరుసటి రోజునే.. మిళింద్ దేవ్రా ట్వీట్ చేశారు. "భారత్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందని నమ్ముతున్నా. మాకు ఇంకా బలమైన నాయకత్వం ఉంది. పార్టీని పూర్వస్థితికి అది తీసుకురాగలదు. నా స్నేహితులు, తోటివారు, విలువైన భాగస్వాములు మమల్ని విడిచిపెట్టలేదనే అనుకుంటున్నా" అని పేర్కొన్నారు.
సచిన్ పైలట్, అశోక్ గహ్లోత్ మధ్య విబేధాలు ఏడాది కాలంగా కొనసాగుతున్నాయి. ఆయనపై కొద్దినెలల క్రితం తిరుగుబాటు జెండా ఎగురవేశారు పైలట్. కానీ, హైకమాండ్ హామీతో పార్టీలోకి తిరిగివచ్చారు. అయినప్పటికీ ఈ విషయంపై చర్యలు తీసుకోవటంలో జాప్యంపై అసంతృప్తిగానే ఉన్నారు. భాజపాతో సచిన్ పైలట్ సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగాహానాలు మళ్లీ వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్కు పెద్ద దెబ్బ!