తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆయనకు తొలిసారా? వారికి తీన్మారా? - స్టాలిన్​

తమిళనాడు రాజకీయాలు అంటే గుర్తొచ్చే రాజకీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే. ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ పార్టీలే శాసిస్తాయి. ప్రతి ఐదేళ్లకోసారి అధికారాన్ని మార్చే తమిళ ప్రజలు.. గత దఫా ఆ ఆనవాయితీని పక్కన పెట్టారు. వరుసగా రెండోసారి 'అమ్మ' పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఆ తరువాత జయలలిత చనిపోయారు. అనంతరం వచ్చిన లోక్​సభ ఎన్నికలల్లో డీఎంకే 39 స్థానాలకు 38 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. మరి ఈ సారి స్టాలిన్​ చరిశ్మా పని చేసి డీఎంకే అధికారంలోకి వస్తుందా? లేక అప్పట్లో ఎంజీఆర్​ లాగా అన్నాడీఎంకే హ్యాట్రిక్​ కొడుతుందా?

AIDMK
డీఎంకే.. అన్నాడీఎంకే

By

Published : Mar 30, 2021, 9:06 AM IST

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్నా.. తమిళ ఓటర్ల అంతరంగం మాత్రం బయటపడటంలేదు. అన్నాడీఎంకే, డీఎంకే పోటీ పడి హామీలిచ్చి, తాయిలాలపై ఉద్ధృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నా.. ఓటర్లు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అన్నాడీఎంకే పదేళ్ల పాలనను కొనసాగించాలా? డీఎంకే అధినేత స్టాలిన్‌ సీఎం అయ్యేందుకు ఓ సారి అవకాశాన్ని కల్పించాలా? అన్న దానిపై మీమాంసలో ఉన్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి పనితీరుపై మాత్రం తటస్థ ఓటర్లలో పెద్దగా అసంతృప్తి కనిపించడంలేదు. దీనివల్ల ఈ ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా.. నువ్వా? నేనా అన్న రీతిలో జరుగుతున్నాయి. చెన్నైతోపాటు తిరువళ్లూరు, సేలం, ఈరోడ్‌, నామక్కల్‌, కోయంబత్తూరు, మదురై జిల్లాల్లో 'ఈనాడు' ప్రతినిధి పర్యటించగా.. ఇదే అంశం స్పష్టమైంది.

తమిళనాడు ఎన్నికలు

ఈ ఎన్నికల ద్వారా హ్యాట్రిక్‌ సాధించి ఎంజీఆర్‌ వారసత్వాన్ని కొనసాగించాలని అన్నాడీఎంకే ఉవ్విళ్లూరుతోంది. మార్పు ఇవ్వాలి, ఒకసారి అవకాశాన్ని కల్పించాలన్న అస్త్రాలతో డీఎంకే ప్రయత్నిస్తోంది. ఎన్నికల ఫలితాలు డీఎంకే కూటమికి అనుకూలంగా ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 39కి 38 స్థానాలను గెలుచుకున్న డీఎంకే నేతల్లో ఈ శాసనసభ ఎన్నికల్లో అదే పంథాను కొనసాగిస్తామన్న ధీమా వ్యక్తమవుతోంది.

డీఎంకే, అన్నాడీఎంకే

ఇదీ చదవండి:ప్రజా 'పరీక్ష'లో పళనిస్వామి పాస్​ అయ్యేనా?

ఎంజీఆర్‌తోనే ఆగిన హ్యాట్రిక్‌

స్వతంత్ర భారతదేశంలో తమిళనాడు శాసనసభకు జరిగిన తొలి మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ వరుసగా గెలిచింది. రాజగోపాలాచారి నేతృత్వంలో ఒకసారి, కామరాజర్‌ నేతృత్వంలో రెండు సార్లు ప్రభుత్వం ఏర్పడింది. 1967, 1971 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే వరుసగా గెలవగా అన్నాదురై, కరుణానిధి నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1977, 1980, 1984 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు అన్నాడీఎంకే గెలవగా.. ఎంజీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరణానంతరం ఇప్పటి వరకు మూడుసార్లు క్రమం తప్పకుండా అధికారంలోకి వచ్చిన పార్టీ అంటూ ఏదీ లేదు.

ఇదీ చదవండి:తమిళనాట వాళ్లు లేకపోయినా వాడీవే'ఢీ'!

ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం

పదేళ్ల పాటు అన్నాడీఎంకే అధికారంలో ఉన్నా అసంతృప్తిలేదని, అయితే, ఒకసారి మరొకరికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సేలం నగరానికి చెందిన కందన్‌ తెలిపారు. అన్నాడీఎంకే, డీఎంకేలు పోటీపడి హామీలు గుప్పించడంతో ఎవరికి ఓటేయాలా? అనే విషయంలో సందిగ్ధంలో ఉన్నామని ‘అమ్మాపేటై’ వాసి మురుగన్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల జీవనాధారం దెబ్బతిన్నప్పుడు ఆర్థికంగా ఈ ప్రభుత్వం ఆదుకోలేదని, ఎన్నికల సమయంలో ఉచితాలు ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ఈరోడుకు చెందిన కార్తికేయన్‌ ప్రశ్నించారు. డీఎంకే గెలుస్తుందని సర్వేలు చెబుతున్నా కమల్‌హాసన్‌ పార్టీకి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు కోయంబత్తూర్‌కు చెందిన సుగుణ తెలిపారు. అన్నాడీఎంకే, డీఎంకేలు ఇప్పటివరకు రాష్ట్రాన్ని పరిపాలించాయని, ఈ సారి మరొకరికి అవకాశమివ్వావలని భావిస్తున్నట్లు మదురైకు చెందిన శివరామన్‌ పేర్కొన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టంగా చెప్పే పార్టీకి ఓటు వేస్తానని కోవై యువకుడు రామచంద్రన్‌ పేర్కొన్నారు. ఏడాదికి 6 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, రేషన్‌కార్డుదారులకు రూ.1500 నగదు హామీ గ్రామీణ ప్రాంతాలలోని వారికి అనుకూలంగా ఉంటుందని తిరువళ్లూరులోని పండ్ల వ్యాపారి పేర్కొన్నారు.

హామీల ప్రభావం ఎంత?

స్టాలిన్​, పళని స్వామి

అధికార అన్నాడీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్‌కార్డుదారులకు సంవత్సరానికి 6 సిలిండర్లు, కుటుంబ మహిళా పెద్దలకు నెలకు రూ.1500 నగదు, ఉచిత కేబుల్‌ కనెక్షన్‌, అమ్మ వాషింగ్‌ మెషిన్‌, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు, ఆటో డ్రైవర్లకు 25 వేల రాయితీతో ఎంజీఆర్‌ హరిత ఆటో తదితర హామీలు ఇచ్చింది. వీటిపట్ల తమిళ ఓటర్లు ఆకర్షితులవుతున్నారు. అయితే.. అన్నాడీఎంకే పదేళ్లపాటు అధికారంలో ఉన్నందున ఓ సారి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు సీఎం అయ్యేందుకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదని కూడా పలువురు భావిస్తున్నారు. డీఎంకే కరోనా బాధిత కుటుంబాలకు రూ.4వేల నగదు, నీట్ రద్దు తదితర 501 హామీలు ఇచ్చింది. ఇవీ ఓటర్లను ఆలోచింపచేస్తున్నాయి.

ఇదీ చదవండి:తమిళనాట 'ఉచిత' వరాల జల్లు- నిపుణుల ఆందోళన

2016 ఎన్నికల ఫలితాలు ఓ రికార్డు!

తమిళ ఓటర్లు ఒక ఎన్నికల్లో ఓ పార్టీకి.. మరో ఎన్నికల్లో ఇంకో పార్టీకి పట్టం కడుతూ వస్తున్నారు. 1989 నుంచి తమిళనాడు ఎన్నికల్లో ఇదో సంప్రదాయంగా మారింది. కానీ, ఈ సంప్రదాయానికి భిన్నంగా 2011, 2016లలో అన్నాడీఎంకేను వరుసగా గెలిపించారు. దీంతో వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఘనత దివంగత మాజీ సీఎం జయలలితకు దక్కింది. జయలలిత మరణానంతరం సీఎం పీఠాన్ని అధిష్ఠించిన పళనిస్వామి ప్రభుత్వం మనుగడపై సందేహాలు వ్యక్తమైనా.. ఆయన నేర్పుగా పాలన సాగించారన్న అభిప్రాయాలున్నాయి. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ సాధించి ఎంజీఆర్‌ రికార్డు సమం చేయాలని పళనిస్వామి రేయింబవళ్లు శ్రమిస్తుండగా.. ఈ ఎన్నికల్లో గెలవకుంటే పార్టీ భవిష్యత్తు, తన వ్యక్తిగత ప్రతిష్ఠ మసకబారుతాయన్న ఆందోళనతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ రెండు పార్టీలు తమ బలబలాలను బేరీజు వేసుకుని బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపాయి. మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపులో జాగ్రత్తపడ్డాయి.

ఇదీ చదవండి:అప్పుడు జయ, కరుణ.. మరి ఇప్పుడు?

ABOUT THE AUTHOR

...view details