కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్). అయితే.. అధికార పక్షంపై వచ్చిన అవినీతి, బ్యాక్ డోర్ నియామకాల ఆరోపణలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వీటికి తోడు తాజాగా.. పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) ర్యాంకర్లు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పీఎస్సీ ర్యాంక్ లిస్ట్ చెల్లుబాటును పొడిగించాలని, తమను కాదని.. తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకుంటోందని ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. అనంతర పరిణామాల నడుమ కొవిడ్ సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం మరో 6 నెలలు గడువు పొడిగించినా అభ్యర్థులు నిరసనలు విరమించలేదు.
వివిధ యూనివర్సిటీల విద్యార్థులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ప్రభుత్వంలో ఎంతో కాలంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను మానవతా ప్రాతిపదికన క్రమబద్ధీకరిస్తున్నామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియ ప్రస్తుత పీఎస్సీ ర్యాంకర్ల అవకాశాలపై ఏ మాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేశారు. అయినా.. తాత్కాలిక నియామకాలపై ఆందోళన చెందుతున్నారు నిరసనకారులు.
అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ సమస్యను ఉపయోగించుకోవాలని భావించిన ఇతర రాజకీయ పార్టీలే నిరసనలను వెనకుండి నడిపిస్తున్నాయని జోరుగా చర్చ సాగుతోంది.
ఇదే అజెండాగా విపక్షాలు ఎన్నికలకు వెళ్లనున్నాయని తెలుస్తోంది. 'బ్యాక్ డోర్ నియామకాల' అంశాన్ని ఎత్తిచూపి.. యూడీఎఫ్ తన యువజన విభాగాలు యూత్ కాంగ్రెస్, కేఎస్‌యూ, యూత్ లీగ్, ఎంఎస్ఎఫ్ ద్వారా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఎల్‌డీఎఫ్‌పై అవినీతి, బంగారం స్మగ్లింగ్ వంటి ఆరోపణలు ఉన్న తరుణంలో ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాలని ఊవిళ్లూరుతోంది.
ఈ నేపథ్యంలో.. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలంటే పినరయి ప్రభుత్వం చెమటోడ్చాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎలా మొదలైంది..?
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నాలజీకి చెందిన 114 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతోనే నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో దీనిని ఇటీవలి బంగారం స్మగ్లింగ్ కేసుతో ముడిపెడుతున్నాయి విపక్షాలు. ఆ కేసులో ప్రధాన నిందితురాలు, ఐటీ శాఖలో పనిచేసిన స్వప్నా సురేష్‌ను పినరయి సర్కార్ నియమించలేదని చెప్పినా.. ఆమెకు అదే శాఖ మాజీ కార్యదర్శి ఎం శివ్శంకర్తో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిసిన అనంతరం ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇలాంటి తాత్కాలిక నియామకాలతో ప్రభుత్వ విభాగాల్లో అవకతవకలకు అవకాశముందని తేటతెల్లమైంది.
ఇదీ చూడండి: బంగారం స్మగ్లింగ్ కేసులో 20మందిపై ఛార్జ్‌షీట్
దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ.. సోలార్ కుంభకోణం నిందితురాలు సరితా నాయర్‌కు సంబంధించిన ఆడియో క్లిప్పులు బహిర్గతమయ్యాయి. అందులో తాత్కాలిక నియామకాలు ఎలా జరుగుతాయి.. ఎవరెవరికి ఎంత ముడుపులు అందుతాయన్నది మాట్లాడుకున్నట్లు ఉంది. ఈ సంభాషణ పీఎస్సీ ర్యాంకర్లలో మరింత భయాలను పెంచింది.