IRCTC Sapta Jyotirlinga Darshan Yatra With Statue of Unity Package Details: కార్తీక మాసం మొదలైంది. ఈ మాసంలో జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తారు. అయితే.. ఒకేసారి ఎక్కువ ప్రదేశాలను దర్శించడం రిస్క్. ఇంకా.. ఖర్చు కూడుకున్న పని. అందుకే.. చాలా మంది వెనకడుగు వేస్తారు. ఇలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఓ అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ట్రిప్‌లో ఏకంగా 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా చూడొచ్చు. ఆ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
షిరిడీ భక్తుల కోసం IRCTC రెండు సూపర్ ప్యాకేజీలు - అతి తక్కువ ధరలో సాయి దర్శనం!
నవంబరు 18 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం అయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్ మొత్తం 12 రాత్రులు 13రోజులు కొనసాగుతుంది.
ప్రయాణం ఇలా..
- నవంబర్ 18న విజయవాడలో రాత్రి 8 గంటలకు రైలు స్టార్ట్ అవుతుంది. ఖమ్మం మీదుగా ప్రయాణం సాగుతుంది.
- రెండో రోజు వేకువజామున 2:42 గంటలకు సికింద్రాబాద్ చేరుకొని అక్కడ టూరిస్టులను ఎక్కించుకొని ప్రయాణం కొనసాగిస్తుంది.
- మూడో రోజు ఉదయం 5:35 గంటలకు ఉజ్జయిని చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం టిఫిన్ తిని రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం ఉజ్జయిని రైల్వే స్టేషన్ చేరుకొని వడోదరకు వెళ్తారు.
- ఐదోరోజు ఉదయం 7:30 గంటలకు వడోదర చేరుకుంటారు. అక్కడ ముందుగా బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత స్టాట్యూ ఆఫ్ యూనిటీ (పటేల్ విగ్రహం)ని వీక్షిస్తారు. అనంతరం ద్వారక బయల్దేరుతారు.
- ఆరో రోజు ద్వారకలో ద్వారకాదీశ్ ఆలయాన్ని వీక్షిస్తారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
- ఏడో రోజు ఉదయం టిఫిన్ చేశాక బెట్ ద్వారకను వీక్షించి, నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని సాయంత్రానికి ద్వారకకు చేరుకుంటారు. తర్వాత సోమనాథ్‌కు బయల్దేరుతారు.
- ఎనిమిదో రోజు సోమనాథ్‌లో కాస్త సేదతీరాక సోమనాథ్ జ్యోతిర్లింగాలయాన్ని దర్శించుకొన్నాక సాయంత్రం సోమనాథ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్లీ ప్రయాణం ప్రారంభమవుతుంది.
- తొమ్మిదో రోజు రాత్రి నాసిక్‌లోనే బస ఉంటుంది.
- పదో రోజు ఉదయం టిఫిన్ చేశాక త్రయంబకేశ్వరున్ని సందర్శించి తిరిగి నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్‌కు వచ్చి పుణే పయనమవుతారు.
- 11 రోజు ఉదయం టిఫిన్ చేశాక భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఔరంగాబాద్ బయల్దేరతారు.
- 12 రోజు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని సికింద్రాబాద్‌కు పయనమవుతారు.
- 13వ రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్, మధ్యాహ్నం 1 గంటకు విజయవాడ చేరుకుంటారు. దీంతో సప్త జ్యోతిర్లింగాల దర్శనం పూర్తవుతుంది.