తెలంగాణ

telangana

రూ.35 కోసం ఐదేళ్ల పోరాటం.. దిగొచ్చిన రైల్వే.. లక్షల మందికి మేలు!

By

Published : May 30, 2022, 7:04 PM IST

IRCTC RS 35 refund: రైల్వే టికెట్ రద్దు చేసుకుంటే.. సాధారణంగా ఛార్జీల రూపంలో కొంత డబ్బు కట్ అయి మిగతా సొమ్ము మన ఖాతాలో జమా అవుతుంది. ఒకట్రెండు రూపాయలు తగ్గితే మనం చూసీచూడనట్టు వదిలేస్తాం. కానీ రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తి అలా చేయలేదు. రూ.35 కోటం ఐదేళ్ల పాటు పోరాడాడు. తనతో పాటు లక్షల మందికి ప్రయోజనం కలిగేలా చేశాడు.

irctc railway ticket refund
irctc railway ticket refund

IRCTC railway ticket refund:కష్టపడి సంపాదిస్తే డబ్బు విలువ తెలుస్తుంది. మరి ఆ డబ్బును అన్యాయంగా ఎవరైనా తీసుకుంటే.. అది రూపాయి అయినా సరే దాని కోసం పోరాటం చేయాల్సిందే. ఈ సిద్ధాంతాన్నే బలంగా నమ్మిన ఓ వ్యక్తి తనకు రావాల్సిన రూ.35 రీఫండ్‌ కోసం ఏకంగా ఐదేళ్లు న్యాయపోరాటం చేశాడు. ఈ క్రమంలో ఆయన విజయం సాధించమే గాక, మరో 3 లక్షల మందికి లాభం చేకూర్చినవాడయ్యాడు. ఇంతకీ ఆయనకు జరిగిన అన్యాయం ఏంటి? ఎలా పోరాటం చేశాడు?

5 year fight for ticket refund:రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఇంజినీర్‌ సుజీత్‌ స్వామి 2017 జులై 2వ తేదీన గోల్డెన్‌ టెంపుల్‌ మెయిల్‌ ద్వారా దిల్లీ వెళ్లేందుకు అదే ఏడాది ఏప్రిల్‌లో రైలు టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. ఆ టికెట్‌ ధర రూ.765. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకున్న సుజీత్‌.. టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నాడు. దీంతో రీఫండ్‌ కింద రూ.665 జమ అయ్యింది. అయితే నిబంధనల ప్రకారం టికెట్‌ క్యాన్సిలేషన్‌కు రూ.65 క్లరికల్‌ ఛార్జీలు వసూలు చేయాల్సి ఉండగా.. రైల్వే మాత్రం రూ.35 సర్వీసు టాక్స్‌ కలుపుకుని మొత్తం రూ.100 ఛార్జ్‌ చేసింది. టికెట్‌ రద్దు చేసుకున్న సమయానికి జీఎస్‌టీ ఇంకా అమల్లోకి రాలేదు. కానీ ప్రయాణ తేదీ జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఉందన్న కారణం చేత రూ.35 సర్వీసు ఛార్జ్‌ వసూలు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న సుజీత్‌ రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేశాడు. లోక్‌ అదాలత్‌ను ఆశ్రయించాడు. ఐఆర్‌సీటీసీకి ఎన్నో సార్లు ఆర్‌టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో దిగొచ్చిన ఐఆర్‌సీటీసీ.. సర్వీస్‌ టాక్స్‌ను రీఫండ్‌ చేసేందుకు అంగీకరించింది. అయితే 2019 మే 1వ తేదీన రూ. 33 మాత్రమే రీఫండ్‌ చేసింది. మరి సుజీత్‌ ఊరుకున్నాడా? లేదు.. ఆ రూ.2 కోసం మరో మూడేళ్లు పోరాటం చేశాడు. ఆయన పోరాటం ఫలించి గతవారం ఆ రెండు రూపాయలను కూడా ఐఆర్‌సీటీసీ ఆయన ఖాతాలో జమ చేసింది.

అంతేకాదండోయ్‌.. ఇలా సుజీత్‌ లాగే లక్షల మంది నుంచి రైల్వే శాఖ జీఎస్‌టీ అమలు సమయంలో సర్వీసు టాక్స్‌ వసూలు చేసిందట. వారందరికీ కూడా రీఫండ్‌ చేసేందుకు రైల్వే బోర్డు అంగీకరించినట్లు ఇటీవల ఐఆర్‌సీటీసీ అధికారి నుంచి తనకు మెయిల్‌ వచ్చిందని సుజీత్‌ వెల్లడించాడు. మొత్తం 2.98 లక్షల మందికి రూ.2.43కోట్లు చెల్లించనున్నామని, త్వరలోనే ఆయా ప్రయాణికులకు వారి ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని సదరు అధికారి చెప్పినట్లు సుజీత్‌ తెలిపాడు.
మరో విషయమేంటంటే.. ఈ ఐదేళ్ల పోరాటంలో తాను విజయం సాధించిన ఆనందంలో సుజీత్‌ పీఎం కేర్స్‌కు రూ.535 విరాళం ఇచ్చాడట. ఏదైతేనేం.. అతడి పోరాటం వల్ల ఎంతో మందికి ప్రయోజనం చేకూరినట్లయింది..!

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details