IRCTC Divya Dakshin Yatra Tour Package :భారత్‌లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు కొదవే లేదు. ఎక్కువ మంది సెలవులు దొరికితే చాలు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం(IRCTC Tourism) ఓ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.14 వేలకే ఏడు పుణ్యక్షేత్రాలను వీక్షించేలా ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. 9 రోజుల పాటు సాగే ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
IRCTC Divya Dakshin Yatra Package Full Details :దివ్య దక్షిణ యాత్ర(Divya Dakshin Yatra) పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూరింగ్ ప్యాకేజీని మరోసారి అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ఇప్పటికే ఓసారి విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు(Bharat Gaurav Tourists Train)లో దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ మరోసారి ఆపరేట్ చేస్తుంది. కేవలం రూ.14 వేలకే ఈ ప్యాకేజీని ప్రయాణికులకు ఆఫర్ చేస్తోంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకున్న వారు అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్‌లోని ప్రముఖ దేవస్థానాలతో పాటు సమీపంలోని పర్యాటక ప్రాంతాలను కూడా వీక్షించొచ్చు. అక్టోబర్ 31న ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ టూర్ మొత్తం 8 రాత్రులు 9 రోజులు కొనసాగుతుంది.
ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూర్, రేణిగుంటలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం అయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు కూడా ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే పర్యాటకులు టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
దివ్య దక్షిణ యాత్ర ప్రయాణం కొనసాగనుందిలా..
- ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఆ రోజంతా ప్రయాణం సాగుతుంది.
- రెండో రోజు ఉదయం తిరువణ్ణామలైకు చేరుకుని.. అక్కడ ప్రసిద్ధి చెందిన అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకొని మధురైకు పయనమవుతారు.
- మూడో రోజు ఉదయం మధురై చేరుకుంటారు. అక్కడ నుంచి బస్సులో రామేశ్వరం చేరుకుని ఆ ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఆ తర్వాత ముందుగా ఏర్పాటు చేసిన హోటల్‌లో భోజనం ఉంటుంది. ఆ రోజు రాత్రి రామేశ్వరంలో బస చేయాల్సి ఉంటుంది.
- నాలుగో రోజు రామేశ్వరం నుంచి మధురైకు ప్రయాణమవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకొని కన్యాకుమారికి ప్రయాణమవుతారు.
- ఐదో రోజు కన్యాకుమారి చేరుకుంటారు. అనంతరం అక్కడి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. వివేకానంద రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్, గాంధీ మండపం, అందమైన సూర్యాస్తమయాన్ని చూడవచ్చు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.
- ఆరో రోజు మార్నింగ్ కన్యాకుమారి రైల్వేస్టేషన్ చేరుకొని తిరువనంతపురం(కొచ్చువేలి) పయనమవుతారు. అక్కడే టిఫిన్ ముగించుకుని అనంత పద్మనాభస్వామిని దర్శించుకొని.. కోవలం బీచ్ అందాలు వీక్షిస్తారు. అనంతరం కొచ్చువేలి రైల్వేస్టేషన్‌కు చేరుకొని తిరుచిరాపల్లికి బయల్దేరుతారు.
- ఏడో రోజు తిరుచిరాపల్లికి చేరుకుంటారు. మార్నింగ్ శ్రీ రంగనాథస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని మధ్యాహ్నం భోజనం ముగించుకుంటారు. అనంతరం అక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూర్ చేరుకొని బృహదీశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటారు.
- అనంతరం తంజావూర్‌లో సికింద్రాబాద్ రైలు ఎక్కుతారు. ఎమిది, తొమ్మిదో రోజు ప్రయాణం ఉంటుంది. 9వ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
How to get Discounts on Train Tickets : రైలు టికెట్లు డిస్కౌంట్లో కావాలా నాయనా..? ఇలా చేయండి!