2022 సంవత్సరానికి గానూ అత్యధిక కాలుష్యం గల ప్రపంచ నగరాల జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2021తో పోలిస్తే ఐదు నుంచి ఎనిమిదో స్థానానికి చేరినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు తొలగినట్టు కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. స్విట్జర్‌ల్యాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ వెల్లడించిన ప్రపంచ వాయు నాణ్యత నివేదికలో భారత్ ఎనిమిదో స్థానానికి చేరింది. ఈ నివేదికను శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు గుర్తించిన పీఎం 2.5 స్థాయి కాలుష్య కారకం ఆధారంగా రూపొందించారు. 131 దేశాలకు చెందిన 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించారు. పీఎమ్ 2.5 వల్ల 20 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించినట్టు ఈ నివేదిక వెల్లడించింది.
భారతదేశంలో వాయు కాలుష్య నివారణకు అయ్యే ఆర్థిక వ్యయం 150 బిలియన్ డాలర్లుగా నివేదిక పేర్కొంది. రవాణా రంగం ప్రధానంగా 20 నుంచి 35 శాతం కాలుష్యాన్ని కలిగిస్తోందని తెలిపింది. పారిశ్రామిక యూనిట్లు, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు, బయోమాస్ దహనం వంటివి కాలుష్యానికి ఇతర కారకాలుగా మారాయని తెలిపింది. కాలుష్యంలో పాకిస్థాన్‌లోని లాహోర్, చైనాలోని హోటన్ నగరాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా భారత్‌లోని భివండీ, దిల్లీ నగరాలు 3,4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. దిల్లీలో 92.6 మైక్రోగ్రాముల పీఎం 2.5 కాలుష్య కారకం సురక్షిత పరిమితి కంటే 20 రెట్లు అధికంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది.