IPS Officer Anjani Kumar Suspension Lifted : డిసెంబర్ 3వ తేదీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో రాష్ట్ర డీజీపీగా ఉన్నఐపీఎస్ అధికారి అంజనీ కుమార్‌నుకేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను సీఈసీ ఎత్తివేసింది.
ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీ కుమార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని, ఇలాంటి సంఘటన మరోసారి జరగదని సీఈసీకి అంజనీకుమార్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ సమాచారం ఇచ్చింది.
అసలేం జరిగిందంటే :డిసెంబర్ 3వ తేదీనరాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అప్పుడు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)గా ఉన్న అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలోనే డీజీపీ అంజనీ కుమార్ రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి సంజయ్ జైన్, ఎన్నికల నోడల్ అధికారి (Election Expenditure) మహేశ్ భగవత్‌లతో కలిసి హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పుష్పగుచ్ఛంతో అభినందించారు.