తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైనర్​ను రేప్ చేస్తే ఇకపై ఉరిశిక్షే!.. IPC సహా బ్రిటిష్ చట్టాలకు కేంద్రం గుడ్​బై - పార్లమెంట్ కొత్త చట్టాలు

IPC CRPC Evidence Act New Bill : బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలకు కేంద్రం చరమగీతం పాడనుంది. ఈ మేరకు దేశ క్రిమినల్ చట్టాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. బ్రిటిష్ కాలంనాటి మూడు చట్టాల స్థానాల్లో కొత్త వాటిని పతిపాదిస్తూ 3 బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టింది. రాజద్రోహం చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం, మైనర్లపై అత్యాచారం, మూకదాడులు చేసేవారికి ఉరిశిక్ష విధించే నిబంధనలను.. బిల్లుల్లో చేర్చింది. మొదటిసారి చిన్నచిన్న నేరాలకు.. సామాజిక సేవ వంటి శిక్ష విధించేలా నిబంధనలు పొందుపరిచింది. కొత్త బిల్లులు వలస పాలన నాటి గుర్తుల్ని చెరిపేస్తాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, సత్వర న్యాయానికి బాటలు పరుస్తాయని ఉద్ఘాటించారు.

ipc crpc evidence act new bill
ipc crpc evidence act new bill

By

Published : Aug 12, 2023, 7:17 AM IST

IPC CRPC Evidence Act New Bill : వలస పాలన తాలూకు గుర్తులను చెరిపేస్తూ భారత నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించే దిశగా కీలక ముందడుగు పడింది. బ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి-IPC, నేర శిక్షాస్మృతి-CRPC, సాక్ష్యాధార చట్టాల స్థానంలో కొత్త శాసనాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం కేంద్రం.. భారతీయ న్యాయ సంహిత-BNS, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత-BNSS, భారతీయ సాక్ష్యా-BS పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు.

IPC CRPC Evidence Act To Be Replaced : పౌరహక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రజల సమకాలీన అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వాటికి రూపకల్పన చేసినట్లుకేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఈ బిల్లులు చట్టరూపం దాలిస్తే ప్రతిఒక్కరికీ గరిష్ఠంగా మూడేళ్లలోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. నూతన బిల్లులను.. లోక్‌సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా అమిత్‌ షా పలు వివరాలను వెల్లడించారు. బ్రిటిష్‌ వలస పాలకుల గుర్తులను చెరిపేస్తామని నిరుడు ఎర్రకోట పైనుంచి ప్రధాని మోదీ వాగ్దానం చేశారని, అందులో భాగంగానే IPC, CRPC, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో మూడు కొత్త బిల్లులు తెచ్చామన్నారు. వీటిలో 313 సవరణలు చేశామన్నారు. దీనివల్ల నేర న్యాయ వ్యవస్థలో సంపూర్ణ మార్పులు వస్తాయని, పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు జవాబుదారీతనంతో వ్యవహరించేలా కొత్త బిల్లుల్లో నిబంధనలు పొందుపరిచామని తెలిపారు. పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేయకుండా ఆంక్షలు తీసుకొచ్చామన్నారు. రాజద్రోహ సెక్షన్‌ను రద్దు చేస్తున్నట్లు వివరించిన ఆయన వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

తాజా బిల్లుల్లో మరిన్ని కీలక అంశాలను పొందుపర్చారు. పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం, పదవులు, పదోన్నతులు ఇప్పిస్తామని తప్పుడు వాగ్దానాలు చేయడం, లేని హోదాలను చెప్పి మోసగించి లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోవడం వంటి చర్యలను నేరాలుగా పరిగణిస్తారు. సామూహిక అత్యాచారాలకు తెగబడితే.. 20 ఏళ్ల జైలుశిక్ష లేదంటే యావజ్జీవ కారాగారం విధించవచ్చు. 18 ఏళ్లలోపు వారిపై అత్యాచారాలకు పాల్పడినవారికి మరణశిక్ష విధించడానికి కూడా వీలుంటుంది. మూకదాడులకు పాల్పడినవారికి ఏడేళ్లు లేదా జీవితఖైదు విధించేందుకు, అవసరమైతే మరణశిక్ష ఖరారు చేసేందుకూ అవకాశముంది. మొబైల్, బంగారు గొలుసుల తస్కరణ కేసుల్లో నిందితులకు శిక్ష విధించడానికి ఇప్పటివరకూ ఎలాంటి నిబంధన లేదు. ఆ తరహా నేరాలనూ కొత్త బిల్లుల్లో చేర్చారు.

ఆయుధంతో చిన్నగా గాయపరిచినా, మనిషి కోమాలోకి వెళ్లేంతగా గాయపరిచినా ఇప్పటివరకూ సెక్షన్‌-324 కింద ఏడేళ్ల శిక్షకు వీలుండేది. ఇకపైచిన్న, పెద్ద గాయాలను వేరుచేసి చూపుతారు. గాయపరచడంవల్ల బ్రెయిన్‌డెడ్‌ అయ్యే పరిస్థితి వస్తే కనీసం 10 ఏళ్లు.. లేదంటే జీవితఖైదు విధించే నిబంధన పొందుపరిచారు. పిల్లలపై నేరాలు చేసేవారికి శిక్షను 7 నుంచి 10 ఏళ్లకు చేర్చారు. జరిమానానూ భారీగా పెంచారు. ఎవరికైనా దోపిడీ, దొంగతనాలు, ఇతర ఆర్థిక నేరాల్లో శిక్షపడితే ఆ నేరం ద్వారా వారు సంపాదించిన సొత్తునంతా స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేసే వీలుంటుంది. లైంగిక హింస కేసుల్లో బాధితురాలి వాంగ్మూలం.. ఆమె ఇంట్లోనే మహిళా పోలీసు అధికారి ఆధ్వర్యంలో మహిళా మేజిస్ట్రేట్‌ ద్వారా నమోదుచేస్తారు. ఆ సమయంలో.. బాధితురాలి తల్లిదండ్రులు, సంరక్షకులు ఉండొచ్చు. SMS., ఇతర ఎలక్ట్రానిక్‌ మార్గాల ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేయడం వీలవుతుంది.

ఎన్నికల్లో ఓటర్లను లంచంతో ప్రలోభపెట్టినా, దొంగ ఓట్లు వేసినా ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించే నిబంధనను BNS బిల్లులో చేర్చారు. డబ్బులు ఇస్తానన్నా, ఇవ్వజూపినా లంచం కిందే పరిగణిస్తారు. అభ్యర్థులు, ఓటర్లను బెదిరించడాన్నీ నేరంగానే పరిగణిస్తారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు.. తప్పుడు ప్రకటనలు చేసినా, అభ్యర్థి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేసినా జరిమానా తప్పదు. నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమై ఘటనాస్థలం నుంచి పారిపోతే పదేళ్ల వరకూ జైలుశిక్ష విధించే ఆస్కారం ఉంది. పోలీసులు ఎవరిని ఎక్కడ అరెస్టు చేసినా దానికి సంబంధించిన అధీకృత పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి పోలీస్​ స్టేషన్‌లో.. ఒక అధికారిని నియమిస్తారు. మీ కుటుంబసభ్యుడు మా కస్టడీలో ఉన్నారని, మాదీ బాధ్యత అని పోలీసులు సర్టిఫికెట్‌లో పేర్కొనాలి. ఈ-FIR నిబంధనను జత చేస్తుండగా ఫిర్యాదుదారులకు పోలీసులు 90 రోజుల్లోపు కేసు పరిస్థితి చెప్పాలి. ప్రతి 15 రోజులకు కేసు స్థితిగతులను తెలియజేయాలి.

ఏడేళ్లకు పైబడి శిక్ష పడే అవకాశమున్న కేసులను ఉపసంహరించుకోవాలంటే తప్పనిసరిగా బాధితుల వాదనలు వినాలి. రాజకీయ కారణాలతో కొన్నిసార్లు శిక్షలను రద్దు చేస్తుండగా.. ఇకపై అలా కుదరదు. మరణశిక్షను యావజ్జీవ కారాగారంగా, జీవితఖైదును ఏడేళ్ల శిక్షగా, ఏడేళ్ల కారాగార వాసాన్ని మూడేళ్ల శిక్ష వరకు తగ్గించేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. భారత సమగ్రత, అఖండత, ఏకతకు సవాలు విసిరే చర్యలు, వేర్పాటువాదం, విద్రోహం, విధ్వంసాలను ఇంతకుముందు రకరకాలుగా పేర్కొనేవారు. అవి ఉగ్రవాద పరిధిలో ఉండేవి కావు. వాటిని కూడా ఇకపై ఉగ్రచర్యలుగా పరిగణించొచ్చు. ఈ వ్యవహారంలో పోలీసులు సొంతంగా నిర్ణయాలు తీసుకోరు. కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేసేందుకు ప్రత్యేక నిబంధనను రూపొందించారు.

New Bills In Parliament 2023 : ఈ బిల్లులు సంపూర్ణమని చెప్పలేనన్న అమిత్‌ షా.. వీటిని పార్లమెంటు స్థాయీసంఘానికి పంపాలని స్పీకర్‌ను కోరారు. అక్కడ అధికార, ప్రతిపక్ష సభ్యులు తగిన సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, బార్‌ కౌన్సిల్, విశ్రాంత న్యాయమూర్తులు, లా కమిషన్‌ కూడా అభిప్రాయాలు చెప్పొచ్చని పేర్కొన్నారు. ఈ బిల్లులువచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకొస్తాయని ఆశిస్తున్నట్లు అమిత్‌ షా తెలిపారు. చట్టసభల్లో.. ఆమోద ముద్ర పడిన మరుసటి రోజే నోటిఫై చేస్తామని చెప్పారు.

Parliament Sine Die Today : ఆన్​లైన్ గేమింగ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం.. ఆప్​ ఎంపీపై సస్పెన్షన్ వేటు

'4 నెలలుగా మణిపుర్​ తగలబడుతుంటే.. పార్లమెంట్​లో మోదీ జోకులా?'

ABOUT THE AUTHOR

...view details