ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీకి దిల్లీ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. వీరిద్దరూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని.. అంతేగాక స్టార్ క్యాంపెయినర్లుగా కూడా ఉన్నందు వల్ల ఉపశమనం కల్పించాలని చిదంబరం తరఫు న్యాయవాది అర్ష్‌దీప్ సింగ్ కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్.. మినహాయింపునిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ అంశంపై ఏప్రిల్ 16న విచారణ జరగనున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ని పరిగణలోకి తీసుకున్న దిల్లీ ఉన్నత న్యాయస్థానం.. నిందితులను మార్చి 24న కోర్టుకు రావాల్సిందిగా ఆదేశించింది. సహ నిందితుడు పీటర్ ముఖర్జియా బెయిల్ దరఖాస్తుపై స్పందించాల్సిందిగా ఈడీకి నోటీసులు జారీ చేసింది.
ఇదీ ఐఎన్ఎక్స్ కేసు..
ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో 2019 ఆగస్టు 21న చిదంబరంపై విచారణ ప్రారంభించింది సీబీఐ. మనీలాండరింగ్ కేసులో 2019 అక్టోబర్ 16న ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆరు రోజుల అనంతరం అక్టోబర్ 22న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో 2019 డిసెంబర్ 4న బెయిల్ మంజూరైంది. చిదంబరం.. కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న కాలం 2007లో రూ.305 కోట్ల విదేశీ నిధులకు సంబంధించి ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపునకు మంజూరు చేసిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) అనుమతుల జారీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ 2017 మే 15న కేసు నమోదు చేసింది. అనంతరం ఈ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఈ క్రమంలో కార్తీని ఫిబ్రవరి 2018లో సీబీఐ అదుపులోకి తీసుకుంది. 2018 మార్చిలో బెయిల్ లభించింది. ఇక మనీలాండరింగ్ కేసులో దిల్లీ హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఇవీ చదవండి:ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరానికి మరిన్ని చిక్కులు
చిదంబరం, ఆయన తనయుడికి దిల్లీ కోర్టు సమన్లు