పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మౌలిక సదుపాయాల విస్తరణ, హిమాలయాల దుర్బలత్వం వల్లే జోషీమఠ్ కుంగుబాటు తరహా ఘటనలు ఎదురవుతున్నట్లు అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (ఐయూసీఎన్) సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు. భారతదేశంలో విపత్తులను తట్టుకోగల సంసిద్ధత, ఎదుర్కొనే సామర్థ్యం గణనీయంగా మెరుగుపడినా.. ఇలాంటి దుర్ఘటనలు తప్పడం లేదని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషీమఠ్‌లో ఇటీవల నివాస, వాణిజ్య భవనాలకు పగుళ్లు ఏర్పడటంతోపాటు రహదారులు, పంటపొలాలు కుంగిపోయిన విషయం తెలిసిందే. అక్కడి కట్టడాలు ప్రమాదకరస్థితికి చేరుకున్నాయని గుర్తించిన అధికారులు వాటిలో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాఖండ్ అధికారులు జోషీమఠ్‌ను కొండచరియలు విరిగిపడే ప్రాంతంగా ప్రకటించారు.
'జోషీమఠ్ తరహా ఘటనలకు కారణాలు అవే.. పరిష్కారానికి ప్రయత్నిస్తాం' - అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి న్యూస్
భారతదేశంలో విపత్తులను తట్టుకోగల సంసిద్ధత, ఎదుర్కొనే సామర్థ్యం గణనీయంగా మెరుగుపడినా.. జోషీమఠ్ తరహా ఘటనలు తప్పటం లేదని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి సీనియర్ అధికారులు తెలిపారు. అయితే పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మౌలిక సదుపాయాల విస్తరణ, హిమాలయాల దుర్బలత్వం వల్లే జోషీమఠ్ కుంగుబాటు తరహా ఘటనలు ఎదురవుతున్నాయని వారు అన్నారు.
"హఠాత్తుగా వచ్చే వరదలు, తుపానులు, జోషీమఠ్ తరహా ఘటనలకు పలు కారణాలు ఉంటాయి. జనాభా పెరుగుదల, యాత్రికులకు సదుపాయాల కల్పన, హిమాలయాల దుర్బలత్వం.. ఇలాంటి విపత్తులకు కారణభూతాలు అవుతున్నాయి. అలాగని అభివృద్ధిని ఆపాలని మేము కోరుకోము. సాధ్యమైనంత వరకు వీటిలో సమతుల్యత కాపాడేందుకే ప్రయత్నిస్తాం. హిమాలయాల్లోని మారుమూల ప్రాంతాలకు కనీస సదుపాయాలు అవసరమని మాకు తెలుసు" అని ఐయూసీఎన్‌లోని భారత ప్రతినిధి యశ్‌వీర్ భట్నాగర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. టీసీఎస్ ఫౌండేషనుతో కలిసి ఐయూసీఎన్ భారత విభాగం 'హిమాలయా ఫర్ ది ఫ్యూచర్' అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. భారతీయ హిమాలయ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సంక్షేమం, సుస్థిరతల పెంపునకు కృషి చేయడమే దీని లక్ష్యం. "ఈ సమస్యలు అన్నింటినీ ఓ సమగ్ర పద్ధతిలో మేము అధ్యయనం చేస్తాము. హిమాలయ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కారానికి విధానాల రూపకల్పన చేస్తాం" అని ఐయూసీఎన్ భారత విభాగం ప్రోగ్రాం మేనేజర్ అర్చనా చటర్జీ తెలిపారు.
TAGGED:
JOSHIMATH