తెలంగాణ

telangana

ETV Bharat / bharat

punjab assembly election: అంతర్గత కలహాలే.. అసలు సవాల్​ - అంతర్గత కలహాలే.. అసలు సవాల్​

punjab assembly election: పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న కాంగ్రెస్‌ ప్రయత్నాలకు సిద్ధూ, సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ శిబిరాల మధ్య విభేదాలు అతిపెద్ద సవాళ్లుగా మారాయి. ఆ రెండు వర్గాలు సహకరించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిద్ధూ వైఖరి.. కాంగ్రెస్​ గెలుపుపై ప్రభావం చూపుతుందా? ప్రత్యర్థులు స్వపక్ష నేతలే ఎందుకయ్యారు. ‘ఒక కుటుంబానికి ఒకటే టికెట్‌’ విధానం తెచ్చిన తంట ఏంటి?

అంతర్గత కలహాలే.. అసలు సవాల్​
అంతర్గత కలహాలే.. అసలు సవాల్​

By

Published : Feb 18, 2022, 7:25 AM IST

'కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌ తప్ప ఇతరులెవరూ ఓడించలేరు'.. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. ఇతర రాష్ట్రాల సంగతెలా ఉన్నా, పంజాబ్‌లో మాత్రం ఇది అక్షర సత్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. అక్కడ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్రతిపక్షాల కంటే అంతర్గత కలహాలు, అసమ్మతుల వల్లే ఎక్కువ నష్టం వాటిల్లే ముప్పుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ప్రస్తుతం ప్రతికూలంగా పరిణమించే అవకాశమున్న అంశాలను ఓసారి పరిశీలిస్తే..

సిద్ధూ గరంగరం మాటలు

పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న కాంగ్రెస్‌ ప్రయత్నాలకు సిద్ధూ, సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ శిబిరాల మధ్య విభేదాలు అతిపెద్ద సవాలుగా మారాయి! ఆ రెండు వర్గాలు పరస్పరం అంతగా సహకరించుకోవడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర జనాభాలో మూడొంతులకు పైగా ఉన్న దళితులను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా చన్నీని కాంగ్రెస్‌ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అధిష్ఠానం ఎవర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించినా తనకు సమ్మతమేనని తొలుత ప్రకటించినప్పటికీ.. తనకు ఆ అభ్యర్థిత్వం దక్కకపోవడంపై సిద్ధూ గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తోంది. పలు వేదికల నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. 'నేను ఇప్పటికే ఇద్దరు-ముగ్గురు సీఎంలను పడగొట్టాను. సరైన దారిలో వెళ్లకపోతే.. మరొకర్నీ గద్దె దింపగల సత్తా నాకుంది' అని ఇటీవల ఓ బహిరంగ సభలో సిద్ధూ వ్యాఖ్యానించారు. అంతర్గత వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ.. చన్నీ మాత్రం సంయమనం పాటిస్తున్నారు. బహిరంగంగా ఎక్కడా సిద్ధూకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అయితే- సిద్ధూ, చన్నీ, ఇతర కాంగ్రెస్‌ నేతలు తామంతా కలసికట్టుగా ఉన్నామని ప్రజలకు స్పష్టంగా తెలియజెప్పడంలో విఫలమవుతున్నారు.

నాయకత్వ సంక్షోభం

పంజాబ్‌లో నాయకత్వ సంక్షోభం కాంగ్రెస్‌కు మరో ప్రతికూలాంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘నా దారి రహదారి’ అన్న చందాన సిద్ధూ ధోరణి ఉందని.. పార్టీలోని ఇతర నేతలను ఆయన కలుపుకొని పోవడం లేదని వారు పేర్కొన్నారు. చన్నీని చాలామంది.. అనుకోకుండా ముఖ్యమంత్రి పీఠమెక్కిన వ్యక్తిగానే చూస్తున్నారని చెప్పారు. స్వపక్షంలోని కొందరు నాయకులతో వేగలేకపోతున్నానంటూ ఎన్నికల్లో పోటీకి పంజాబ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ దూరంగా ఉండటం, పార్టీతో దాదాపు 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకొని మాజీ మంత్రి జోగిందర్‌సింగ్‌ ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో చేరడం, ఎన్నికల ప్రచారంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకుంటుండటం వంటి పరిణామాలు.. రాష్ట్రంలో పార్టీకి సమర్థ నాయకత్వం లేదని చెప్పే పరిస్థితులను కల్పిస్తున్నాయని అన్నారు.

ప్రత్యర్థులూ స్వపక్ష నేతలే..

‘ఒక కుటుంబానికి ఒకటే టికెట్‌’ అనే విధానం పంజాబ్‌లో కాంగ్రెస్‌కు తలనొప్పిగా తయారైంది. పార్టీ తరఫున అభ్యర్థిత్వం దక్కని అసంతృప్తులు పలు స్థానాల్లో స్వతంత్రులుగా బరిలో నిలిచారు. సీఎం చన్నీ తమ్ముడు మనోహర్‌ బస్సీ పఠానా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌సింగ్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరికొన్ని స్థానాల్లోనూ ఇలాంటి పరిస్థితులున్నాయి. హస్తం పార్టీలో టికెట్‌ దక్కకపోవడంతో ఇతర పార్టీల్లోకి వెళ్లి బరిలో నిలిచినవారు వీరికి అదనం. మరోవైపు- పటియాలా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న ప్రణీత్‌ కౌర్‌.. తన భర్త, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ అధినేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ప్రతికూలతలన్నింటినీ కాంగ్రెస్‌ ఎలా అధిగమిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details