శనివారం నుంచి కురుస్తున్న వర్షాలు చెన్నైతోపాటు దాని సమీప జిల్లాలను వరదలతో ముంచెత్తుతున్నాయి(chennai floods). చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. చెన్నై పరిసరాల్లోని 3 రిజర్వాయర్ల నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరి కాలనీలన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్పొరేషన్ అధికారులు మోటార్లతో నీటిని తోడుతున్నారు. తమిళనాడుకు మరో నాలుగైదు రోజులు భారీ వర్ష సూచన ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో(tamil nadu floods) అప్రమత్తమైన అధికారులు చెన్నైతోపాటు సరిహద్దు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
లోతట్టు ప్రాంతాల్లో వరద పరిస్థితిని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిశీలించారు. వరద బాధితులకు సాయం అందించారు. వారికి భోజనాన్ని కూడా స్వయంగా వడ్డించారు.
వరద ప్రభావిత ప్రాంతల ప్రజలకు సాయం అందిస్తున్న సీఎం స్టాలిన్ వరద బాధితులకు స్వయంగా ఆహారం వడ్డిస్తున్న సీఎం స్టాలిన్ వరద బాధితులకు సాయం అందిస్తున్న సీఎం స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో(tamil nadu floods 2021) సహాయక చర్యల కోసం అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోంది. తిరువళ్లూరు, చెంగల్ పట్టు, మధురై పట్టణాల్లో 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. తమిళనాడులో గతనెల ఒకటి నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే 43 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు(tamil nadu heavy rain).
ఆ రెండు రోజులు ముప్పే..
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నవంబర్ 10, 11 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని హెచ్చరించింది. వరదలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు తుపాను ప్రసరణం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి, అల్పపీడనంగా కేంద్రీకృతమై నవంబర్ 11 తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పింది.
ఆదివారం చెన్నైలో భారీ వర్షం కురిసిందని, సోమవారం తీవ్రత కాస్త తగ్గిందని ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. అయితే 10, 11 తేదీల్లో మాత్రం తీవ్రత అధికంగా ఉంటుందని స్పష్టం చేశారు.
వర్షాలకు నీటమునిగిన ప్రాంతం మోదీ ఫోన్...
భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు(tamil nadu rain update). వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని, విపత్తు నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:యూపీలో జికా కలకలం.. మరో 10 మందికి వైరస్