కరోనా యోధులైన వైద్యులు, వైద్య సేవల సిబ్బందికి సంబంధించిన బీమా పథకాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ సాధికారక బృందాలు (ఎంపవర్డ్ గ్రూప్స్) పనితీరుపై అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షా నిర్వహించారు. అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఆరోగ్య సిబ్బందిపై ఒత్తిడి పడకుండా.. పౌర సమాజంలోని వలంటీర్లను కొవిడ్‌పై పోరులో వినియోగించుకోవాలని అధికారులకు మోదీ సూచించారు.
"వివిధ సాధికారక బృందాల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించాం. కొవిడ్‌పై పోరులో ప్రజలకు ఎన్నో విధాలుగా సాయం చేసేందుకు ఈ బృందాలు పని చేస్తున్నాయి."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
రోగులకు, ఆరోగ్య సిబ్బందికి మధ్య సంప్రదింపులు కొనసాగేందుకు ఎన్జీఓలు సహాయపడగలవని అధికారులు ఈ సమావేశంలో మోదీకి వివరించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను హోం క్వారంటైన్లో ఉన్న వారితో మాట్లాడేందుకు కాల్‌సెంటర్ సేవలు అందించేలా వినియోగించవచ్చని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో.. పేదలకు ఉచిత ఆహార పదార్థాల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మోదీ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న బీమా క్లెయిమ్‌లు వేగవతంగా పరిష్కరించాలని తెలిపారు. తద్వారా మరణించిన వారిపై ఆధార పడిన వారు ప్రయోజనాలు పొందగలుగుతారని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో గరీబ్ కల్యాణ్ యోజన వంటి ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలపై మోదీకి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు అధికారులు.
ఇదీ చూడండి:'ఆక్సిజన్ కోసం ఆపరేషన్ సముద్ర సేతు-2'
ఇదీ చూడండి:'ఆ రాష్ట్రాల్లో ఐదు రెట్ల వేగంతో కొవిడ్ 2.0 వ్యాప్తి'