ఛత్తీస్‌గఢ్‌లో ఘరానా మోసం వెలుగుచూసింది. వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన ఓ వ్యక్తి.. బీమా డబ్బు కోసం తన కుటుంబంతో సహా మృతి చెందినట్లు డ్రామా సృష్టించాడు. రూ.72 లక్షల బీమా సొమ్ము కోసం ప్రమాదవశాత్తు తన కుటుంబంతో సహా కాలిబూడిదైనట్లు ఆధారాలు తయారు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చాకచక్యంగా వ్యవహరించి వ్యాపారి కుటుంబం బతికే ఉన్నట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు దాదాపు 1,000కి పైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కాంకేర్ జిల్లాలోని సమీరన్ సిక్దర్ అనే వ్యక్తి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పులపాలయ్యాడు. ఎలాగైనా వీటినుంచి బయటపడాలని బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. దీనిలో భాగంగా తన కుటుంబసభ్యుల పేరుమీద ఉన్న బీమా సొమ్మను చేజిక్కుంచుకుని.. వాటితో అప్పులు తీర్చాలని భావించాడు. దీని కోసం పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. అనుకున్న ప్రకారం మార్చి 1న తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కాంకేర్ నుంచి కారులో బయలుదేరి ధామ్తరి జిల్లాకు చేరుకున్నాడు. అక్కడ ఓ లాడ్జిలోని రూమ్ అద్దెకు తీసుకొని తన కుటుంబాన్ని అందులో ఉంచాడు. ఆ తర్వాత అక్కడనుంచి అదే కారులో తిరిగి ప్రయాణమై కాంకేర్‌లోని చావాడీ గ్రామ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ తన కారుతో బలవంతంగా ఓ చెట్టును ఢీకొట్టి.. దానికి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో తాను కూడా చనిపోయినట్లు నమ్మించడానికి మొబైల్ ఫోన్‌ను ఆ మంటల్లో వేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారై.. ధామ్తరిలోని తన కుటుంబం వద్దకు చేరుకున్నాడు. దర్యాప్తు కోసం వచ్చిన పోలీసులు.. కారు మంటల్లో చిక్కుకుని కాలిబూడిదైనట్లు తొలుత రికార్డు చేసుకున్నారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలు గుర్తించే పనిలో పడ్డారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు దాదాపు వెయ్యికి పైగా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. దీంతో పాటు 45 వేల ఫోన్ నంబర్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశారు. వీటిని ఆధారంగా పోలీసులు సమీరన్ కుటుంబం రాయ్‌పుర్‌లోని ఓ ఫొటో స్టూడియోలో కొన్ని ఫ్రింటింగ్‌కు ఇచ్చి ధామ్తరిలో కలెక్ట్ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో సమీరన్ కుటుంబం పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసిందని.. ప్రస్తుతం వారంతా సజీవంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. ధామ్తరి జిల్లా నుంచి సమీరన్ కుటుంబం మార్చి 2న అలహాబాద్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పట్నా, గువాహటి ప్రాతాలకు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.