తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ సైబర్​ క్రైమ్.. బోనస్​ పేరుతో వల.. రూ.కోటి స్వాహా

Cyber Crime: బీమా పాలసీలో బోనస్‌ ఇస్తామని చెప్పి ఓ వ్యక్తిని సైబర్‌ నేరగాళ్లు భారీ మోసం చేశారు. సుమారు కోటి రూపాయలు వసూలు చేశారు. ఏడాదిన్నర తర్వాత గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

insurance-bonus-gang-cheated-one-crore-rupees-in-delhi
insurance-bonus-gang-cheated-one-crore-rupees-in-delhi

By

Published : Jul 18, 2022, 9:57 PM IST

One Crore Cyber Crime: దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. వారు, వీరు అని తేడా లేకుండా అందరినీ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు.. చదువుకున్న వాళ్లు, చదవురాని వాళ్లు.. ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆఖరికి అధికారులు సైతం నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని మోసపోతున్నారు. తాజాగా దిల్లీకి చెందిన ఓ వ్యక్తి.. సైబర్​ మోసగాళ్ల చేతిలో మోసపోయి రూ. కోటి పోగట్టుకున్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం..కంఝవాలాలోని కరాలా గ్రామంలో షేర్​ సింగ్​ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. 2019 అక్టోబరులో అతడికి సుష్మా తివారీ అనే ఓ యువతి కాల్​ చేసింది. తాను ఐజీఎమ్​ఎస్​ ముంబయి నుంచి మాట్లాడుతున్నానని చెప్పింది. మాక్స్​ లైఫ్​ ఇన్సూరెన్స్​లో పాలసీపై కొంత డబ్బు కడితే బోనస్​ వస్తుందని నమ్మించింది. అందుకు తొలుత రూ.8,234 డిపాజిట్​ చేయాలని చెప్పింది. అకౌంట్​ వివరాలు కూడా ఇచ్చింది. దాంతో పాటు ఆధార్​ కార్డు, బ్యాంక్​ చెక్కు, పాన్​ కార్డు, ఫోటో పంపాలని కోరింది. ఆమె చెప్పినట్టే బాధితుడు వివరాలు అన్నీ పంపాడు.

ఆ తర్వాత మాయమాటలు చెప్పి వివిధ ఫార్మాలిటీల పేరుతో మెల్లిగా బాధితుడు నుంచి డబ్బులు రాబట్టింది ఆ యువతి. ప్రతిసారి ఎంత మొత్తంలో డిపాజిట్ చేసినా అతడికి బోనస్ మాత్రం రాలేదు. ఈ విధంగా గత ఏడాదిన్నర కాలంలో వివిధ బ్యాంకు ఖాతాల్లో కోటి రూపాయలకు పైగా జమ చేశాడు బాధితుడు. దాని తర్వాత కూడా బోనస్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించాడు. రోహిణి సైబర్‌ సెల్‌ పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

'ఏ బీమా కంపెనీ అలా కాల్​ చేయదు' బోనస్ లేదా బీమా పునరుద్ధరణ పేరుతో ఇటీవల పెద్ద సంఖ్యలో ముఠాలు మోసం చేస్తున్నాయని సైబర్ నిపుణులు మోహిత్ యాదవ్ తెలిపారు. ఏ బీమా కంపెనీ కూడా తన కస్టమర్లకు కాల్​ చేయదని ఆయన చెప్పారు. ఒకవేళ అలా ఎవరైనా కాల్ చేస్తే బ్యాంక్ లేదా ఇన్సూరెన్స్ ఆఫీస్‌కి వెళ్లి విచారణ చేయమని పేర్కొన్నారు. కాల్‌లో పేర్కొన్న ఏ బ్యాంకు ఖాతాలోనూ డబ్బు జమ చేయవద్దని సూచించారు. మోసపోయినట్లు అనుమానమొస్తే.. www.cybercrime.gov.in వెబ్​సైట్, మెయిల్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ 155260 ద్వారా సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఇవీ చదవండి:నీట్ పరీక్షలో 'అక్రమాలు'.. రంగంలోకి సీబీఐ.. 8 మంది అరెస్ట్

జీన్స్​ వేసుకోవద్దన్న భర్తను చంపిన యువతి.. భార్యను అలా అన్నారని ముగ్గురి హత్య

ABOUT THE AUTHOR

...view details