మహారాష్ట్ర పాల్‌ఘర్‌లోని వాసాయ్‌లో పుట్టిపెరిగాడు హర్షవర్ధన్ జోషి. వృత్తిరీత్యా ఐటీ ఇంజినీర్. చిన్నప్పటి నుంచీ వీడియో గేమ్స్ అంటే ఇష్టపడే ఈ కుర్రాడి జీవితాన్ని.. 2011లో స్థానికంగా ఓ కొండనెక్కిన అనుభవం మలుపు తిప్పింది. తర్వాతే పర్వతారోహణపై మక్కువ పెరిగింది. ఏదో ఒకరోజు ఎవరెస్టు శిఖరంపై అడుగుపెట్టాలని 2015లో లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొద్ది కాలం శిక్షణ తీసుకుని, ఒంటరిగానే మౌంట్ స్టాక్ కంగ్రీని అధిరోహించి, ఆ పర్వతం ఎక్కిన మొదటి 20 ఏళ్ల లోపు వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
6వేల మీటర్ల ఎత్తున్న 11శిఖరాలపై అడుగుపెట్టి.. పర్వతారోహణలో నైపుణ్యాలను సాన బెట్టుకున్నాడు హర్షవర్ధన్. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో కఠిన సాధన చేశాడు. అందులో భాగంగా 2018లో లద్దాఖ్ వెళ్లి, మౌంటేన్ గైడ్‌గా పనిచేశాడు. అలా పర్వతాలపై విస్తృత అనుభవం సంపాదించాడు. ఎత్తైన ప్రదేశాలపై తనకున్న భయాలను ఆ కొండలూ, గుట్టలే తొలగించాయని చెప్తాడు హర్షవర్ధన్.
లాక్‌డౌన్ అడ్డుకాలేదు..
లాక్‌డౌన్ కారణంగా సాధనకూ, తన ఆశయానికీ హర్షవర్ధన్ కొంతకాలం దూరం కావాల్సి వచ్చింది. అయినా ఖాళీగా కూర్చోకుండా, ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్‌పై దృష్టి పెట్టాడు. సైక్లింగ్, పరుగు మొదలు పెట్టాడు. మార్చిలో గోవాలో జరిగిన ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్‌లో పాల్గొన్నా డు. అక్కడ హర్షవర్థన్‌ను చూసిన కాలిఫోర్నియాకు చెందిన ఓ కోచ్.. ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఐరన్ మ్యాన్ ట్రయథ్లెట్‌గా నిలవలేకపోయినా సరైన శిక్షణ, నేపథ్యం లేనివాళ్లు కూడా ఆత్మవిశ్వాసంతో పోటీల్లో పాల్గొనవచ్చన్న సందేశమిచ్చాడు హర్షవర్ధన్.