సెమిస్టర్లు, సిలబస్, ప్రాజెక్టులు, ఇంటర్నల్స్ ఓవైపు...స్నేహితులు, షికార్లు, సరదాలు మరోవైపు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ఇంతకుమించిన వ్యాపకాలు ఏముంటాయి? విద్యాపరంగా ప్రత్యేకతలు సాధించేందుకు శ్రమించేవారు కొందరైతే... ఆసక్తి, అభిరుచుల కోసం కష్టపడేవారు మరికొందరు. రెండో కోవకే చెందుతాడు అహ్మదాబాద్‌కు చెందిన యువరాజ్ పవార్.
ఈ యువకుడి పేరు యువరాజ్ జనార్దన్ పవార్. అహ్మదానగర్‌లోని నింభరి ఈయన స్వస్థలం. ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నాడు. ఆ యువకుడు చేసిన ఆవిష్కరణ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. పల్సర్ ద్విచక్రవాహనం ఇంజిన్ వాడి, ఇంట్లో దొరికే పరికరాలతోనే వింటేజ్ కారును రూపొందించాడు యువరాజ్. పదో తరగతి చదువుతున్న తమ్ముడు ప్రతాప్ సహకారంతో కారు తయారు చేసుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఏదైనా ఆసక్తికరమైన పని చేయాలనుకున్న సోదరులిద్దరూ 150 సీసీ బైక్‌ను కారుగా మలిచారు. కుమారుల ఆవిష్కరణను చూసి, యువరాజ్ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.
"నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. మా అబ్బాయి తయారుచేసిన కారులో కూర్చున్నప్పుడు మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది. చాలా చిన్న వయసులోనే ఈ కారు తయారు చేశాడు. చదువు పూర్తికాకముందే, మూడో ఏడాదిలో ఉన్నప్పుడే ఇంతమంచి కారు రూపొందించాడు."
- అనురాధా పవార్, యువరాజ్ తల్లి