ఓ తెలుగు సినిమా చూసి మోక్షం పొందాలని గత బుధవారం ఒంటికి నిప్పంటించుకున్న రేణుకా ప్రసాద్ (23) అనే యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి సమీపంలో ఒక గ్రామానికి చెందిన బాధితుడు ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పిన తర్వాత తన గ్రామంలోనే ఖాళీగా ఉండేవాడు. ఏదో ఒక పని చూసుకోవాలని తల్లిదండ్రులు చెప్పిన మాటను వినిపించుకోలేదు.
తెలుగు సినిమా చూసి బలవన్మరణం.. 20 లీటర్ల పెట్రోల్ పోసుకొని..
ఓ తెలుగు సినిమా చూసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామ శివార్లలో 20 లీటర్ల పెట్రోలును పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
కొద్ది కాలం క్రితం విడుదలైన ఓ తెలుగు సినిమాను 25 సార్లు చూశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుందని.. పునర్జన్మ ఉండదని విశ్వసించాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ గ్రామశివార్లలో 20 లీటర్ల పెట్రోలును ఒంటిపై పోసుకుని తాను ప్రాణత్యాగం చేసి మోక్షం పొందుతున్నానని సెల్‌ఫోన్‌లో సెల్ఫీవీడియో తీసి, తన తండ్రికి పంపించాక నిప్పంటించుకున్నాడు. బాధితుడ్ని స్థానికులు రక్షించి, బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రేణుకా ప్రసాద్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.