శరీరం ఎటూ కదలలేని స్థితిలో ఛార్టెడ్ అకౌంటెన్సీ పరీక్ష పాసై ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు. పుట్టుకతోనే దివ్యాంగుడైన భవ్య పలేజా.. ఉత్తమ ప్రదర్శన చేసి సీఏ పాసయ్యాడు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని, అందుకు అంగవైకల్యం అడ్డుకాదని చాటిచెప్పి తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు.
శభాష్ భవ్య... శరీరం కదలకున్నా సీఏ పాస్.. ఆదర్శంగా యువకుడి కథ!
పుట్టుకతోనే దివ్యాంగుడైన ఓ యువకుడు సీఏ పాసయ్యాడు. ఈ విధంగా తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు.
అమరావతి జిల్లాకు చెందిన భవ్య పలేజా.. పుట్టుకతోనే దివ్యాంగుడు. వెన్నెముక కండరాల బలహీనత కారణంగా అతడు నడవలేడు. కుర్చీలో కూడా సరిగా కూర్చోలేడు. నడుము, కుర్చీకి కలిపి బెల్ట్ కట్టినప్పుడు మాత్రమే కూర్చోగలడు. పుట్టుకతోనే అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న తమ కుమారుడు ఏదో ఒక రోజు ఉన్నత విజయాలను సాధిస్తాడని భవ్య తల్లిదండ్రులు భావించేవారు. తమ కుమారుడు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కనేవారు. భవ్యను రోజూ తన తల్లిదండ్రులే స్కూల్‌కు తీసుకుని వెళ్లేవారు. అతడు స్కూల్లో బెంచ్‌లో కూడా కూర్చోలేని పరిస్థితి. 1 నుంచి 12వ తరగతి వరకు భవ్య.. మణిబాయి గుజరాతీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. 10వ, 12వ తరగతిలో 90 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు. తర్వాత విద్యాభారతి కళాశాలలో బీ.కాం, ఎం.కాం పూర్తి చేశాడు.
భవ్య ఉన్నత విద్యను అభ్యసించే సమయంతో అతడి తల్లిదండ్రులు సమాజంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు కూడా భవ్యను చులకనగా చూసేవారు. అలాంటి వారిని పట్టించుకోకుండా ఆశయాన్ని సాధించాలనే పట్టుదలతో భవ్య, అతని తల్లిదండ్రులు ముందుకు సాగారు. అయితే వారి కష్టానికి ఇప్పుడు మంచి ఫలితం దక్కింది. భవ్య సీఏ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఏ పాసైన భవ్యను చూసి ఉపాధ్యాయులు సైతం అతడి గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు.
TAGGED:
maharashtra latest news